Tirupati News: తిరుపతి జిల్లా వరదయ్యపాలెం పంచాయతీ ఎస్సీ కాలనీ(హరిజనవాడ) అంగన్వాడీ కేంద్రాన్ని వివాదంతో మూసివేయడం చర్చనీయాంశంగా మారింది. సీడీపీవో స్వయంగా వచ్చి సమస్య పరిష్కరించే వరకు అంగన్ వాడీ కేంద్రాన్ని తీయబోమని ఇటీవల పదవీ విరమణ పొందిన అంగన్ వాడీ టీచర్ ఆనందమ్మ తేల్చి చెప్పింది.


వరదయ్యపాలెం పంచాయతీ ఎస్సీ కాలనీ(హరిజనవాడ) లో అంగన్ వాడీ టీచర్ గా పని చేస్తున్న ఆనందమ్మ గత జనవరిలో పదవీ విరమణ చెందారు. అయితే తనకి ఎవరూ లేనందున తన బాగోగులు చూస్తున్న.. తన బంధువులకు తన ఉద్యోగాన్ని ఇవ్వాలని ఆనందమ్మ కోరడంతో అవకాశాలని పరిశీలిస్తామని సీడీవోవో హామీ ఇచ్చారు. 




సీపీడీఓనే మా మధ్య గొడవ పెట్టిందంటూ ఆనందమ్మ ఆరోపణలు


అయితే పదవీ విరమణ 62 వరకు పెంచినందున ఆ అవకాశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చిన సీడిపీవో.. ఆయాగా పని చేస్తున్న నాగమణికి పదోన్నతి ఇస్తామని ఆశ పెట్టి.. బందువుల్లా కలసి మెలసి ఉన్న తమ మధ్య సిడిపివో చిచ్చు పెట్టారని అంగన్వాడీ టీచర్ ఆనందమ్మ ఆరోపిస్తుంది. స్వయంగా తమకు ఆశ చూపిన సిడీపీఓనే వచ్చి వివాదాన్ని పరిష్కరించాలని ఆనందమ్మ వాదనకు దిగింది. అయితే సిడీపీఓ దేవకుమారి స్పందిస్తూ.. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 60 ఏళ్లు పూర్తి కావడంతో ఆనoదమ్మ పదవి విరమణ ఉత్తర్వులు వెలువడిందని, కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం పని చేస్తున్న ఆయాకు పదోన్నతి ఇచ్చారని తెలిపారు. 62 ఏళ్లకి పదవి విరమణపై తన పరిధిలో లేదని.. ఈ విషయంలో గానీ ఈ వివాదంలో గానీ తన ప్రమేయం లేదని అన్నారు.




అయితే అంగన్వాడీ కేంద్రానికి ఆనందమ్మ తాళం వేయడంతో..  పిల్లలతో సహా ప్రస్తుత టీచర్ బయటే చెట్టు కింద కూర్చుంది. వారికి రైమ్స్ చెప్తూ.. అక్షరాలు నేర్పిస్తోంది. అయితే చిన్న చిన్న పిల్లలను ఇలా బయట కూర్చోపెట్టడం బాగాలేదని.. తనకు వచ్చిన ఉద్యోగాన్ని తప్పించాలనే ఆనందమ్మ ఇలా చేస్తుందని ఆయాగా పని చేసిన నాగమణి చెబుతోంది. 


వారం రోజుల క్రితం ఇలాంటి ఘటనే - కానీ చిన్నారులను లోపల ఉంచి తాళం  


చిత్తూరు జిల్లాలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. అంగన్వాడీ చిన్నారులను గదిలో బంధించి వేశారు. బైరెడ్డిపల్లి మండలం పాతూరునత్తం గ్రామంలో అంగన్వాడీ  కేంద్రంలో  చిన్నారులను  బంధించి తాళం వేశారు అంగన్వాడీ టీచర్,సిబ్బంది (ఆయా). గదిలో ఉన్న భయంతో ఏడుస్తుండడంతో స్థానికులు గమనించి పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అభం శుభం తెలియని చిన్నారుల అరుపులను విని తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రానికి చేరుకున్నారు.  చిన్న పిల్లలపై శ్రద్ధ వహించని అంగన్వాడీ టీచర్ పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ పంతులమ్మ సొంత పనుల బిజీలో  పిల్లల శ్రద్ధను గాలికి వదిలేసిందని ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ఈ అంగన్వాడీ కేంద్రంపై స్థానికులు పలు ఆరోపణలు చేస్తున్నారు. బైరెడ్డిపల్లి మండలంలో అంగన్వాడీ పర్యవేక్షణ అధికారి పర్యవేక్షణ చేయడంలేదని తల్లిదండ్రులు అంటున్నారు.  గతంలో ఈ అంగన్వాడీ సెంటర్ లో పిల్లల పట్ల అశ్రద్ధ చూపుతున్న టీచర్ పై పత్రికల్లో కథనాలు వచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.