Chittoor Crime News: తాళికట్టి కడవరకు తోడుగా ఉంటానని అగ్నిసాక్షిగా ఏడు అడుగులు వేసిన భర్తే ఆమె పాలిట యముడుగా మారాడు. భార్య పట్ల అనుమానం పెంచుకున్న భర్త విచక్షణ కోల్పోయి.. తరచూ భార్యతో గొడవకు దిగేవాడు. రోజూ వేధింపులకు గురి చేసేవాడు. ఎవరితో మాట్లాడినా అనుమానంగా ప్రశ్నిస్తూ,‌ నోటికి వచ్చినట్లు దూషించేవాడు. భర్తే కదా అని భరిస్తూ వచ్చిన పాపానికి ప్రాణాలు కోల్పోయిందా మహిళ. అత్యంత కిరాతకంగా కత్తితోగొంతు కోసి ఇంట్లో పడేసి పరార్ అయ్యాడు. 


అసలేం జరిగిందంటే..?


చిత్తూరు డీఎస్పీ శ్రీనివాస మూర్తి కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లె, విద్యానగర్ లోని ఓ అపార్ట్మెంట్లో ఢిల్లీ బాబు(48), అతని భార్య హేమలత(45)లు నివాసం ఉంటున్నారు. అయితే ఢిల్లీబాబు.. నెల్లూరు మండలంలోని గాండ్లపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. హేమలత కొంగారెడ్డిలోని ఆర్కే మోడల్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే కొడుకులను ఉన్నత చదువులు చదివిస్తూ ఇంత కాలం వీరు హాయిగా జీవించారు. అయితే గత కొంత కాలంగా భార్య హేమలతపై ఢిల్లీ బాబు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెతో తరచుగా గొడవ పడుతున్నాడు. చిన్న చిన్న కారణాలకే భార్యను నోటికి వచ్చినట్లు దూషిస్తూ.. చిత్రహింసలు పెడుతున్నాడు. ఎవరితో మాట్లాడినా వారితో భార్యకు అక్రమ సంబంధాన్ని అంటగట్టేవాడు ఢిల్లీబాబు.


గొంతు కోసి చనిపోయే వరకు చూస్తూనే ఉన్న ఢిల్లీబాబు


హేమలత పని చేసే ప్రైవేటు స్కూల్ వద్ద కాపు కాసి మరీ ఆమెను మానసికంగా వేధించేవాడు. ఈ క్రమంలోనే ఇద్దరి‌ మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో భార్యపై కక్ష పెంచుకున్న ఢిల్లిబాబు భార్యను హత్య చేసేందుకు పక్కాగా ప్లాన్ వేశాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం శుక్రవారం సాయంత్రం ముగ్గురు కుమారులను బంధువుల ఇంటికి పంపాడు. ఆ తర్వాత భార్యపై కత్తితో దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టులాడుతున్న భార్య ప్రాణాలు విడిచేంత వరకూ అలానే చూస్తూ పైశాచిక ఆనందం పొందిన ఢిల్లీ బాబు ఆతర్వాత తన మొబైల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి పరార్ అయ్యాడు. అయితే శనివారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోయే సరికి అనుమానం వచ్చిన అపార్మెంట్ వాసులు వీరి ఇంట్లోకి వచ్చి చూశారు. అప్పటికే చనిపోయి రక్తపుమడుగులో పడి ఉన్న హేమలతను చూసి భయపడిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం హేమలత మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు ఢిల్లీ బాబు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు డీఎస్పీ శ్రీనివాస మూర్తి వెల్లడించారు. అయితే తల్లి హత్య వార్త తెలుసుకున్న కుమారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అనవసరంగా అనుమానం పెంచుకున్న తండ్రి.. తమకు త్లలి లేకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.