ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గం విస్తరణపై జగన్ నిర్ణయం తీసుకున్నారని ఇక మిగిలింది ప్రకటనే అన్న ప్రచారం గట్టిగా జరుగుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ ఆశావహులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇద్దరికి క్యాబినెట్‌లో చోట దక్కనుందనే ప్రచారం జరుగుతుంది. ఉత్తరాంద్ర నుంచి ఒకరికి సామాజిక వర్గాల వారీగా, కులాల సమీకరణలో మరొకరికి స్దానం ఉంటుందన్న అంశం పార్టీలో చర్చ జరిగింది. ఇందులో భాగంగానే పలువురు పేర్లు కూడా తెర మీదకు వచ్చాయి. మంత్రి అప్పల రాజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవటం, ఆ వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా సీఎంను కలవటంపై ఊహాగానాలు మరింతగా పెరిగాయి. 


మంత్రివర్గం విస్తరణలో రెండే అంశాలు కీలకం అనే ప్రచారం కూడా లేకపోలేదు. మొదటిది ఉత్తరాంద్ర ప్రాంతంపై ప్రత్యేకంగా పట్టు సాధించాలనే టార్గెట్‌ను జగన్ ఆలోచిస్తున్నారని, ఇంకొకటి పార్టీలో కులాల వారీగా మరింత బలం పెంచుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు అంటున్నాయి. రాబోయే ఎన్నికలనే టార్గెట్‌గా చేసుకొని పార్టీని మరింతగా ముందుకు తీసుకువెళ్ళటంతోపాటు, ప్రభుత్వంలో కూడా కీలకంగా వ్యవహరించాల్సిన అంశాలను పరిగణంలోకి తీసుకొని జగన్ మంత్రివర్గంపై నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం ఉంది.


ప్రస్తుతం 25మంది మంత్రులు...
ఆంధ్రప్రదేశ్ క్యాబినేట్‌లో ఇప్పటి వరకు 25మంది మంత్రులు ఉన్నారు. శాసన మండలిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం మరింతగా పెరిగింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులతో కలపి శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 43మంది సభ్యులు ఉన్నారు. దీంతో శాసన సభ, శాసన మండలిలో కూడా బలం పుష్కలంగా ఉన్న వేళ ఎన్నికలకు సమాయత్తం కావటానికి ఇప్పటి నుంచే బలాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయంలో జగన్ ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.


ఉన్నవారితో సరిపెట్టవచ్చు....
ఇప్పుడు క్యాబినేట్ మంత్రులతో సరిపెట్టుకోకుండా మరో రెండు మంత్రి పదవులు ఇవ్వటం ద్వారా అదనంగా వచ్చే లాభమేంటని అనుమానాలు మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండు మంత్రి పదవులు కోసం కోత్తగా అభ్యర్థులను ఎంపిక చేస్తే పరిస్థితులు మరోలా ఉంటాయని అంటున్నారు. ఉన్న వారిని కాదని అదే స్థానంలో మరొకరికి ఛాన్స్ ఇస్తే మాత్రం రాజకీయంగా పరిస్థితులు మారతాయాని చర్చ జరుగుతుంది. ఇప్పటికే సిదిర అప్పలరాజు, బొత్సా వంటి నేతల పేర్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగటంతో కులాల వారీగా సమీకరణాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తిగా మారింది.


మాకే అంతంత మాత్రం...
ఇప్పటికే ఉన్న మంత్రి వర్గంలో చాలా మంది అసహనంతో ఉన్నారని సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. మంత్రివర్గంలో ఉన్న వారికి అధికారాలు లేవని, నిధులు కూడా లేకపోవటంతో కేవలం అలంకారప్రాయంగా పదవుల్లో కంటిన్యూ అవుతున్నామంటూ కొందరు మంత్రులు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారని ప్రచారం నడుస్తోంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రంగా నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయటం కూడా పార్టీలో పరిస్థితులకు అద్దం పడుతుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి కరోనా కాలంలో రెండేళ్లు గడిచిపోవటంతో మెదటి దఫాలో ఉన్న మంత్రులకు మాజీ అనే పేర్లు తప్ప ఏమి మిగలేదంటున్నారు. రెండో దఫాలో మంత్రులు అయిన వారు నిధులు సమస్యతో ఇబ్బందులు పడుతుంటే, ఇప్పుడు మరోసారి క్యాబినేట్ విస్తరణ ద్వారా ఏం లాభమే పెదవి విరుపులు కూడా పార్టీలో ఉన్నాయి. కేవలం సంఖ్యా బలంతో సరిపెట్టే పరిస్థితులు మాత్రమే ఉంటాయా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.