Tirupati News: తిరుపతిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో మరో గుండె మార్పిడి శస్త్ర చికిత్సను శుక్రవారం రాత్రి విజయవంతంగా నిర్వహించారు వైద్యులు. తమిళనాడులో రోడ్డు ప్రమాదానికి గురైన నాగరాజ్ (27) అనే యువకుడికి బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో అక్కడి వైద్యుల సూచన మేరకు అతని కుటుంబ సభ్యులు అవయవ దానానికి అంగీకరించారు. దీంతో చిన్న పిల్లల హృదయాలయంలో చికిత్స పొందుతున్న కడప జిల్లాకు చెందిన ఓ 13 ఏళ్ల బాలికకు అతని గుండెను అమర్చేందుకు వైద్యులు నిర్ణయించారు. ఈక్రమంలోనే చెన్నై నుండి తిరుపతికి విమాన సర్వీసులు లేకపోవడంతో రోడ్డు మార్గం ద్వారా గుండెను తరలించారు. చెన్నై సెంట్రల్ లోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో నాగరాజు శరీరం నుంచి వేరు చేసిన గుండెను అంబులెన్సు ద్వారా గంట 50 నిమిషాల సమయంలో తిరుపతికి తీసుకుని వచ్చారు. అయితే ఇంతకంటే ముందుగానే పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యులు.. ఆపరేషన్ థియేటర్లో సర్జరీకి అవసరమైన అన్ని సిద్ధం చేసుకుని గుండె కోసం ఎదురు చూశారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి పక్కన ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి చేరుకుంది. అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్య బృందం ఆ గుండెను బాధితురాలికి అమర్చారు. రాత్రంతా సుమారు 7 గంటల పాటు వైద్యులు శ్రమించి శస్త్ర చికిత్స చేయగా.. ఆపరేషన్ సక్సెస్ అయింది.
ఫిబ్రవరి 28న 13 నెలల పాపకు గుండెమార్పిడి చికిత్స
ఏడాది వయసు ఉన్న పాపకు గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసి తిరుపతిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ హాస్పిటల్ పునర్జన్మను ప్రసాదించింది. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన 13 నెలల పాప అనారోగ్యం బారిన పడగా.. ఆమె తల్లిదండ్రులు విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాప గుండె పనితీరు సరిగ్గా లేది.. గుండె మార్పిడి చేస్తేనే ఆమె బతుకుతుందని చెప్పారు. అలాగే తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. మూడు నెలల క్రితం తల్లిదండ్రులు ఆ పాపను హృదయాలయంలో చేర్చగా.. పాపకు సరిపోయే గుండె కోసం వైద్యులు జీవన్ దాన్ లో రిజిస్టర్ చేశారు. అప్పటి నుంచి ఆస్పత్రికి తీసుకుని వచ్చి అడ్మిట్ చేశారు. ఆస్పత్రి డైరెక్టర్ శ్రీనాథ రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు ఆ చిన్నారికి వైద్యం చేస్తూ వచ్చారు.
అయితే చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో రెండేళ్ల బాలుడికి బ్రెయిన్ డెడ్ అయినట్లు సమాచారం అందడంతో ఏపీ జీవన్ దాన్ సంస్థ, చిన్న పిల్లల గుండె చికిత్సల నిపుణులు డాక్టర్ గణపతి బృందాన్ని డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి సమన్వయం చేశారు. టీటీడీ సహకారంతో అంబులెన్స్, మరో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకొని వైద్య బృందం ఆదివారం రాత్రికే చెన్నై చేరుకుంది. గ్రీన్ చానల్ అవసరం లేకుండా 2 గంటల 15 నిమిషాల్లోనే గుండెను తిరుపతిలోని ఆస్పత్రికి తీసుకొచ్చారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు గుండె చేరుకోవడంతో.. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ గణపతి నేతృత్వంలోని బృందం గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. అయితే 30 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఈ చికిత్సను టీటీడీ ప్రాణదానం, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా ఉచితంగా చేశారు.
ఇప్పటి వరకూ చిన్నపిల్లల హృదయాలయంలో ఆపరేషన్లు ఎన్ని చేసారంటే..?
టీటీడీ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం చిన్నారుల పాలిట ప్రాణ దాతగా మారింది. ఈ ఆసుపత్రిని గత ఏడాది అక్టోబర్ 11 వ తారీఖున ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అప్పటి నుండి ఎన్నో కష్టతరమైన, అరుదైన శస్త్ర చికిత్సలు ఈ ఆసుపత్రిలో నిర్వహించి విజయవంతం అయ్యారు. ఇప్పటి వరకు దాదాపుగా 1000 మంది చిన్నారులకు శ్రీ పద్మావతి చిన్నపిల్లల హాస్పిటల్ ఆపరేషన్ నిర్వహించారు వైద్యులు.