తిరుపతి జిల్లా పుత్తూరు మండలం గొల్లపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పోలాక్షమ్మ జాతర సందర్భంగా పొంగళ్ళు పెట్టేందుకు వచ్చిన దళితులను పోలాక్షమ్మ ఆలయంలోకి వెళ్ళనివ్వకుండా అగ్ర కులస్తులు అడ్డుకున్నారు. వారు ఏకంగా ఆలయానికి తాళం వేసి అడ్డుకున్నారని బాధితులు ఆరోపించారు. దళితులు ఆలయం వద్దకు వెళ్ళే సరికే అప్పటికే ఆలయ పూజారి దళిత గ్రామస్థులకు ప్రవేశం లేదంటూ ఆలయానికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీంతో దళితులు ఆలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కా
నీ ఆలయ పూజారి, గ్రామస్తులు స్పందించక పోవడంతో చేసేది లేక ఆలయం ఎదుటే పొంగళ్ళు పెట్టి అమ్మవారికి వారు మొక్కులు చెల్లించుకున్నారు. దళిత పోరాట హక్కుల సమితి జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ.. పోలాక్షమ్మ ఆలయంలోకి దళితులకు ప్రవేశం కల్పించాలని మూడు నెలలుగా తాము పోరాటం చేస్తున్నామని అన్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, తహసీల్దార్ ప్రవేశం కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ రోజుల్లోనూ తమపై అంటరానితనం ప్రదర్శిస్తుండడం పట్ల గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.