Tirumala TTD: భక్తి భావాన్ని పెంచేలా, సనాతన ధర్మాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చిన్నతనం నుంచే భక్తి భావాని పెంచేలా తిరుమలలో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. గోవింద కోటి రాసిన 25 సంవత్సరాల లోపు యువతీ, యువకుల కుటుంబాలకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది. అలాగే 10 లక్షల 1,116 సార్లు గోవింద కోటి రాసిన భక్తులకు బ్రేక్ దర్శనం కల్పిస్తామని తెలిపింది. విద్యార్థినీ విద్యార్థుల్లో ఆధ్యాత్మికత పెంచేలా రాష్ట్రంలో ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలకు 20 పేజీల భగవద్గీత పుస్తకాని పంపిణీ చేస్తామని పాలకమండలి సభ్యులు తెలిపారు. 


అలాగే ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా.. భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యలను కల్పించనున్నట్లు టీటీడీ తెలిపింది. 18వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వామి వారికీ పట్టు వస్త్రాలని సమర్పిస్తారని పేర్కొంది. అలాగే 2024 డైరీ క్యాలెండరులని సీఎం ఆవిష్కరిస్తారని టీటీడీ తెలిపింది. రూ. 1.65 కోట్లతో ముంబయిలో మరో ఆలయాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించింది. రూ.5.35 కోట్లతో సమాచార కేంద్రాన్ని నిర్మిస్తామని.. పాలకమండలి సభ్యులే దీన్ని నిర్మిస్తారని వెల్లడించింది. రూ. 2 కోట్లతో మూలస్థాన ఎల్లమ్మ ఆలయాన్ని ఆధునికీకరిస్తామని పేర్కొంది. రూ. 49.5 కోట్లతో టీటీడీ క్వార్టర్స్ ని ఆధునికీకరిస్తామని తెలిపింది. 413 మంది అర్చకులు, పరిచారకులు, పోటు సిబ్బంది పోస్టులు మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించినట్లు ఈ సందర్భంగా చెప్పింది.


పద్మావతి అస్పత్రిలో 300 మంది సిబ్బంది నియామకానికి ఆమోదించినట్లు పేర్కొంది. రూ. 2.46 కోట్లతో టీటీడీ అస్పత్రుల్లో మందుల కొనుగోలుకు ఆమోదం లభించినట్లు చెప్పింది. 47 వేద అధ్యాపకుల పోస్టులు మంజూరు చేసేందుకు ఆమోదించినట్లు వెల్లడించింది. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో సౌకర్యాల కల్పనకు రూ. 33 కోట్లు కేటాయించింది టీటీడీ. తిరుపతి రోడ్ల మర్మతులకు రూ. 4 కోట్లు కేటాయింపులు జరిపింది. అలాగే రూ. 600 కోట్లతో గోవిందరాజ సత్రాల స్థానంలో అచ్యుతం, శ్రీపాదం భవనాలు నిర్మించనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా మాట్లాడిన టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.


Also Read: Telangana High Court: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం


ఈ నెల 18 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు


తిరుమలలో ఈ నెల 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబ‌రు 17న అంకురార్ప‌ణ జ‌రగ‌నుంది. బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో సెప్టెంబరు 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. వాహ‌న‌సేవ‌లు ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతాయి. సెప్టెంబర్ 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 14వ తేదీన అంకురార్పణ జరగనుంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. అక్టోబర్ 23వ తేదీన నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.