Tirupati: చెన్నైలో పేరు మోసిన నలుగురు రౌడీషీటర్లను తిరుపతిలో అరెస్టు చేశారు. నారాయణవనం సమీపంలోని కైలాసకోన వద్ద వాహనాల తనిఖీలో రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూసి పరార్ అవుతుండగా సినీ పక్కీలో వెంబడించి పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు రౌడీ షీటర్ల నుంచి నాటు బాంబులు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. 


చెన్నైలో కదివరన్ గ్యాంగ్ కు చెందిన నలుగురు రౌడీ షీటర్లను నారాయణవనం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాటు బాంబులు, 2 కత్తులు, 2 ద్విచక్ర వాహనాలు, రూ. 8,500 నగదు, ఆరు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై చెన్నైలో పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించి, వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. 


పోలీసులు ఆర్.గణేష్ అలియాస్ తిప్పై గణేష్ అలియాస్ ఢిల్లీ గణేష్(30), బోస్ ప్రభు(29), పుగయోంతి(23), కే.అజిత్(21)లను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వారిని నారాయణవనం పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా.. చెన్నైలోని కదివరన్ రౌడీ గ్యాంగ్ కు చెందిన రౌడీ షీటర్లుగా తెలిసిందని నారాయణవనం సీఐ సురేష్ కుమార్ వెల్లడించారు. వీరిలో ఏ1 గణేష్ పై 25 కేసులు, ఏ2 బోస్ ప్రభుపై 5 కేసులు, పుగయోంతిపై 13 కేసులు, రౌడీషీట్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే చెన్నైలో కదివరన్ గ్యాంగ్ కు, పుచ్చే సురేష్ గ్యాంగులకు విభేదాలు ఉన్న క్రమంలో గత కొద్ది రోజులుగా ఈ రెండు గ్యాంగులు ఒకరిపై మరొకరు దాడిలు చేసుకుంటున్నాయి. ఈ గొడవల్లో పుచ్చే సురేష్ గ్యాంగ్ లో ఏడుగురు మరణించగా, కదివరన్ గ్యాంగ్ లో 9 మంది మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే పుచ్చే సురేష్ ను  చంపేందుకు ప్లాన్ చేసినా కదివరన్ గ్యాంగ్ కత్తులు, బాంబులను నారాయణవనం మీదుగా చెన్నైకి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ నలుగురు నిందుతులు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించామని నారాయణవనం సీఐ సురేష్ కుమార్ వెల్లడించారు.