case Filed against YSRCP MLC Zakia Khanam | తిరుమల: నిత్యం ఏదో విషయంతో తిరుమల వ్యవహారం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా తిరుమలలో దర్శన టికెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారం వెలుగుచూసింది. వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై తిరుమల టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. బ్లాక్‌లో వీఐపీ దర్శన టికెట్లు విక్రయిస్తోందని జకియా ఖానంపై ఆరోపణలు వస్తున్నాయి. ఆరు వీఐపీ టిక్కెట్లకు రూ.65 వేలు వసూలు చేశారని బెంగళూరుకు చెందిన భక్తుడు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగు చూసింది.


శ్రీవారి దర్శన టికెట్లలో మోసం చేస్తున్నారని బెంగళూరుకు చెందిన భక్తుడు వైసీపీ ఎమ్మెల్సీపై ఫిర్యాదు చేశారు. బ్లాక్‌లో వీఐపీ దర్శన టికెట్లు విక్రయించడంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం పేరు చేర్చారు. వీరితో పాటు ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. 


ఎమ్మెల్సీ జకియా ఖానం సిఫార్సుతో వచ్చిన ఆరు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు బ్లాక్ లో విక్రయించడంతో వివాదం మొదలైంది. అధిక ధరలకు శ్రీవారి దర్శనం టికెట్లు విక్రయిస్తున్నారని భక్తుల టీటీడీ విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు. టీటీడీ విజిలెన్స్ వింగ్ సమాచారంతో తిరుమల టూ టౌన్ పీఎస్‌లో వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై కేసు నమోదైంది.


దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా తిరుపతి వ్యవహారం
కొన్ని రోజుల కిందట ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దమారం రేపాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ హయాంలో తిరుమల ప్రతిష్ట దిగజార్చేలా, స్వామివారికి అపచారం జరిగేలా ఎన్నో జరిగాయని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలకు వచ్చే ఏఆర్ డైరీ నెయ్యి శాంపిల్స్ ను గుజరాత్ లోని ఎన్‌డీడీబీకి పంపి టెస్టులు చేపించగా.. నెయ్యి కల్తీ అయినట్లు తేలిందని టీటీడీ ఈవో శ్యామలరావు సైతం చెప్పారు. అయితే అనుమానం వచ్చిన నెయ్యి శాంపిల్స్ ను లడ్డూ తయారీలో తాము వినియోగించలేదన్నారు. గతంలోనూ కల్తీ నెయ్యి తిరుమలకు రాగా, ఆ ట్యాంకర్లను వెనక్కి తిప్పి పంపించామని వైసీపీ నేతలు సైతం స్పష్టం చేశారు.