Paruveta Utsavam at Tirumala:
తిరుమలలో పార్వేటి ఉత్సవం ఘనంగా నిర్వహించింది టీటీడీ. నేటి (మంగళవారం) ఉదయం స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా పార్వేటి మండపంకు వేంచేపు చేసి, స్వామి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి వారు శేషాచలం అటవీ ప్రాంతంలో వేట సాగించే దృశ్యంను అర్చకులు నిర్వహించారు. అనంతరం టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అతిపురాత మండపంమైన, కూలడానికి సిద్దంగా ఉన్న పరిస్థితిలో తిరుమల పార్వేటి మండపం స్థానంలో టీటీడీ ప్రాచీన రీతిలో అత్యద్భుతంగా నూతన మండపాన్ని నిర్మించిందని, ఈ రోజు పార్వేటి ఉత్సవానికి విచ్చేసిన ప్రతి భక్తుడూ ఈ నూతన మండప నిర్మాణం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
విమర్శకులు ఎవరైనా ప్రతి ఒక్కటీ రాజకీయ కోణంతో చూసి విమర్శించడం సరైన చర్య కాదని భూమన తప్పు బట్టారు. అందరూ కూడా భక్తులే కావచ్చు కానీ అది సకారాత్మక దృక్కోణమా లేక నకారాత్మక దృక్కోణమా అనేది ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన కోరారు. మనం చేసే సలహా సద్విమర్శగా ఉండాలని, అది కూడా భగవంతునికి సంబందించిన విషయాల్లో అయితే ఓ సలహాగానే ఉండాలని, విమర్శల దాడి చేసి వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవాలను కోవాలనుకుంటే దేవుని పట్ల అపచారం చేసిన వాళ్లవుతారని చెప్పారు. మనకు వచ్చిన ఆలోచనే చాలా శాస్త్రీయమైనదని అనుకుంటే అది వారి పొరపాటేనని, టీటీడీలో పనిచేస్తున్న అర్చకులు కావచ్చు, ఆగమ పండితులు కావచ్చు, లేదా అత్యున్నత అధికారులంతా జ్ఞానం లేకుండా పని చేస్తారని, మన ఒక్కరమే చాలా గొప్పగా ఆలోచిస్తామని అనుకోవడం బాధాకరంమన్నారు. టీటీడీ అధికారులంతా చాలా భక్తితో పని చేస్తారని, అంతేకాకుండా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని తపన పడుతుంటారనే విషయం గమనించాలని టీడీడీ ఛైర్మన్ భూమన కోరారు.
వందల సంవత్సరాల నుంచి ఉన్న నిర్మాణాలు ఉపయోగంలో లేనప్పుడు వాటిని కాపాడుకోవడం తేలికే కానీ, వాటిని ప్రతి సారి వినియోగించుకోవాలని అనుకున్నప్పుడు వాటితో ప్రయోగాలు చేయడం చాలా తప్పిదమన్నారు. పార్వేటి మండపం చాలా శిథిలావస్థలో కూలిపోయే పరిస్థితిలో ఉండేది కనుక దాన్ని ఆధునీకరించామని తెలిపారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డికి వచ్చిన మంచి ఆలోచన ఇదని, చాలా చక్కగా దాన్ని ఆధునీకరించడం జరిగిందని, ప్రతి భక్తుడు ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నారని టిటిడి ఛైర్మన్ భూమన పేర్కొన్నారు.
పాత మండపం లాగే నూతన పార్వేటి మండపం నిర్మాణం: టిటిడి ఈవో
అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను పాటిస్తూ ఈ ఏడాది కూడా పార్వేటి మండపంలో పార్వేటి ఉత్సవంను శాస్త్రోక్తంగా నిర్వహించామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. పార్వేటి మండపంలో స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, ఆస్దానం నిర్వహించిన తర్వాత వేట చేసే ఆచారాన్ని నిర్వహించామని చెప్పారు. పాత పార్వేటి మండపం శిధిలావస్థకు చేరుకోవడంతో రిపేర్ చేయడానికి అవకాశం లేని పక్షంలో పార్వేటి మండపంను నూతనంగా నిర్మించి జీర్ణోద్ధరణ చేశాం, పార్వేటి మండపంను జీర్ణోద్ధరణ చేసిన తర్వాత అత్యంత అద్భుతంగా నిర్మించామని పేర్కొన్నారు. పాత పార్వేటి మండపంలో ఉండే కళాఖండాలను చిత్రాలు తీసి వాటిని టీటీడీ అలాగే నూతన పార్వేటి మండపంలో ఉంచి అత్యంత సుందరంగా తీర్చి దిద్దినట్లు వివరించారు.