Tirumala Srivari Pushkarini: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం పుష్కరిణిని నెల రోజులపాటు మూసివేయాలని టీటీడీ నిర్ణయించింది.  ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు పుష్క‌రిణిని మూసివేస్తారు. పుష్క‌రిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు నెల రోజులపాటు పుష్కరిణి మూసివేయనున్నారు. మరమ్మతుల  కారణంగా నెల రోజుల పాటు పుష్క‌రిణి హార‌తి ఉండ‌దని టీటీడీ స్పష్టం చేసింది. 


సాధారణంగా స్వామి పుష్క‌రిణిలో నీరు నిల్వ ఉండే అవ‌కాశం లేదు. పుష్క‌రిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్త‌మ రీసైక్లింగ్ వ్య‌వ‌స్థ‌ అందుబాటులో ఉంది. నిరంత‌రాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. శ్రీవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్క‌రిణిలో నీటిని తొల‌గించి చిన్న చిన్న మ‌ర‌మ్మ‌తుల‌ను పూర్తి చేస్తారు.. పుష్క‌రిణి మ‌ర‌మ్మ‌తుల కోసం మొద‌టి ప‌ది రోజుల పాటు నీటిని తొల‌గిస్తారు. ఆ త‌రువాత ప‌ది రోజులు మ‌ర‌మ్మ‌తులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివ‌రి ప‌ది రోజులు పుష్క‌రిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్క‌రిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. టీటీడీ వాట‌ర్ వ‌ర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు.


శ్రీవారి సేవలో వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి 
తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో ఎమ్మెల్సీ కళ్యాణి పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేదపండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.. ఆలయ వెలుపలకు వచ్చిన ఎమ్మెల్సీ కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నారని ఆమె కొనియాడారు. రానున్న ఎన్నికల్లో 175 కి 175 సీట్లు వైసిపి కైవసం చేసుకొనందుంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రెండు లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు వైసీపీ ఖర్చు చేసిందని ఆమె వెల్లడించారు.. ప్రతిపక్ష మహిళా నాయకురాలు అనిత సభ్యతతో మాట్లాడితే బాగుంటుందంటూ ఆమె హితవు పలికారు.


శ్రీవారి సేవలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు 
తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మల్లాది విష్ణు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ప్రజలకు ఏం చేశారు చెప్పడం లేదని, అధికార పార్టీపై బురద చల్లడమే పనిగా పెట్టుకుని ఉన్నారంటూ ఆయన విమర్శించారు.. జగన్ మా చేతిలో ఓటమి పాలు కావడం ఖాయమని ప్రతిపక్షాలు అసత్య ప్రసారం చేస్తున్నారని, సీఎం జగన్ అన్ని శాఖలలో సమూల మార్పులు తీసుకొచ్చారంటూ ఆయన చెప్పారు.. నాలుగు సంవత్సరాలుగా ఏపీ రాష్ట్రంలో పేదవారి శాతం 10 శాతం తగ్గిందని, 16వ శాతం నుండి ఆరు శాతానికి చేరిందన్నారు.. 2024 ఎన్నికల్లో వైసిపి విజయం తధ్యమని మల్లాది విష్ణు ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial