Tirumala Road Accident:తిరుమల : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. 24వ మలుపు వద్ద తుఫాన్ వాహనం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు మృతి చెందగా, మరో ఆరు మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది.  రోడ్డు ప్రమాదం జరగడంతో ఘాట్ రోడ్డులో కొంత సమయం  ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. విజిలెన్స్, పోలీసులు కొంతసమయానికి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ప్రమాదానికి గురైన భక్తులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారని సమాచారం. 


అసలేం జరిగిందంటే.. 
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీవారి దర్శనంతరం తిరిగి తిరుమల నుండి తిరుపతికి వస్తుండగా 24వ మలుపు వద్ద అదుపు తప్పిన తుఫాన్ వాహనం ఆంజనేయ స్వామి వారిని మొక్కుతున్న మెదక్ కు చెందిన పార్వతమ్మను ఢీ కొని, ప్రక్కనే ఉన్న పిట్ట గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటన స్ధలంలోనే పార్వతమ్మ మృతి చెందగా, తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా రాయదుర్గానికి చెందిన రేణుకమ్మ మృతి చేందింది. మరో ఐదుగురు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచి పోవడంతో టిటిడి‌ విజిలెన్స్, ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.