బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం... ఎంతచూసినా తనివి తీరని అద్భుతం వేడుక . బ్రహ్మోత్సవాలను కనులారా చూసి తరించాలని లక్షల మంది భక్తులు భావిస్తారు. అందుకే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో ఇసకేస్తే రాలనంత జనం కనిపిస్తారు. కలియుగదైవంగా భావించే కోనేటిరాయుడి దర్శనానికి పరితపిస్తారు భక్తజనం.
బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవానికి తిరుమల ముస్తాబయ్యింది. ఈఏడాది అధికమాసం రావడంతో రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది టీటీడీ. ఇప్పటికే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలేశుడు సిద్ధమవుతున్నాడు. ఈరోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు(శనివారం) అంకురార్పణ చేయనున్నారు తిరుమల పండితులు. రాత్రి 7గంటల నుంచి 8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు. స్వామివారి సేనాదిపతులైన విష్వక్కేనుల వారు ఆలయం నుంచి ప్రదక్షణగా తిరువీధుల్లో తిరుగుతూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత ఆలయంలోని యాగశాలలో అంకురార్పణకు కార్యక్రమాన్ని నిర్వహించి ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పిస్తారు.
రేపటి (అక్టోబర్ 15 ఆదివారం) నుంచి జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ ఉదయం, రాత్రి వాహన సేవలు నిర్వహించనున్నారు. రేపు(ఆదివారం) ఉదయం 9 నుంచి 11 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం ఉంటుంది. రేపు(ఆదివారం) రాత్రి పెదశేష వాహనసేవతో బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభమవుతాయి. పెదశేష వాహనసేన 7గంటల నుంచి 9గంటల వరకు జరుగుతుంది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాలలో ప్రధానమైన ఘట్టం గరుడ వాహన సేవ 19వ తేదీ జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు అయిన ఈనెల 23న శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది. దీంతో వేడుకలు ముగుస్తాయి.
ఈసారి గరుడ వాహనసేవను అరగంట ముందుగా నిర్వహిస్తున్నారు. రాత్రి 7గంటలకు కాకుండా.. సాయంత్రం 6:30లకే గరుడ వాహనసేవ ప్రారంభమవుతుంది టీటీడీ తెలిపింది. గరుడ వాహనసేవను చూసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తిరుమల చేరుకుంటారు. గరుడసేవకు ముందు రోజు నుంచే గ్యాలరీల్లో వేచిచూస్తారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా.. టీడీపీ చర్యలు తీసుకుంటోంది. గరుడ సేవను అరగంట ముందుగా నిర్వహిస్తోంది. ఈనెల 19న గడుర సేవ తర్వాత... 20న సాయంత్రం పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, 23న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దీంతో నవరాత్రి బ్రహ్మోత్సవ ఘట్టం ముగుస్తుంది.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తిరుమల అందంగా ముస్తాబయ్యింది. ఏడుకొండలపై ఎటు చూసినా బ్రహ్మోత్సవాల పోస్టర్లే కనిపిస్తున్నారు. వైభవం మండలం దగ్గర టీటీడీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పూల మొక్కల మధ్య అనంతపద్మనాభస్వామి నమూనా ఆలయం ఆకట్టుకుంటోంది. ఇక బ్రహ్మోత్సవాల్లో సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు భక్తులకు కల్పించే అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులకు కల్పించే ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. దసరా సెలవుల కారణంగా... నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్దసంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నారు టీటీడీ అధికారులు. సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.