Salakatla Brahmotsavam 2022: తిరుపతి : తిరుమలలో ఈ నెల 27వ తేదీ నుండి అక్టోబరు 5వ తేదీ వరకూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నామని టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి చెప్పారు. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారి వాహన సేవలు విహరించే తిరుమాఢ విధుల్లో, భక్తుల వేచి ఉండే గ్యాలరీలో ఏర్పాట్లను టీటీడీ వివిధ విభాగ అధిపతులతో కలిసి టీటీడీ ఈవో పరిశీలించారు. టీటీడీ అధికారులకు బ్రహ్మోత్సవం ఏర్పాట్లపై ఈవో పలు సూచనలు చేశారు. 


అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు.. 
అనంతరం టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. ఈ ఏడాది అత్యంత వైభవంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ గరుడ వాహన సేవ నిర్వహిస్తామని, రెండేళ్ల అనంతరం తిరుమాఢ విధుల్లో జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు విశేష సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనాకు వచ్చాంమన్నారు. బ్రహ్మోత్సవ నిర్వహణలో భాగంగా ఎస్పీ, కలెక్టర్, సీవీఎస్వోలతో సంయుక్తంగా సమీక్ష నిర్వహించాంమని, సామాన్య భక్తులకు భద్రత, మెరుగైన సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కలెక్టర్, సీవీఎస్వో, స్థానిక పోలీసు అధికారుల సమన్వయంతో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు టీటీడీ యంత్రాంగానికి పోలీసులకు సహకరించాల్సిందిగా టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.


శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల బుక్‌లెట్లను టీటీటీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఇటీవల ఆవిష్కరించారు. తొలుత సెప్టెంబ‌రు 20న ఉద‌యం 6 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది. సెప్టెంబ‌రు 26న రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు బ్రహ్మోత్సవాల అంకురార్పణ నిర్వహిస్తారు. సెప్టెంబరు 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల మ‌ధ్య మీన ల‌గ్నంలో ధ్వజారోహ‌ణం నిర్వహించనున్నారు. 


శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్..
సెప్టెంబరు 27 - సాయంత్రం 5.45 నుంచి 6.15  గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం, రాత్రి 9 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు పెద్ద శేష వాహనం
సెప్టెంబరు 28 - ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు హంస వాహన సేవ
సెప్టెంబర్ 29 - ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు సింహ వాహనం, రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు ముత్యపు పందిరి వాహనం
సెప్టెంబర్ 30 - ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు సర్వభూపాల వాహనం
అక్టోబర్ 1 - ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు మోహినీ అవతారం, రాత్రి 7 నుంచి గరుడ వాహన సేవ
అక్టోబర్ 2 - ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుంచి 5 గంట‌ల వ‌ర‌కు ర‌థ‌రంగ డోలోత్సవం, రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు గజ వాహన సేవ 
అక్టోబర్ 3 - ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు చంద్రప్రభ వాహనం 
అక్టోబర్ 4 - ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు అశ్వ వాహన సేవ
అక్టోబర్ 5 - ఉదయం 6 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు చక్రస్నానం, రాత్రి 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం