తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి కి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆదివారం రోజున 82,398 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 30,076 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, 4.40 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా స్వామి వారికి కానుకలు సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 14 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు 24 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు మూడు గంటల సమయం పడుతుంది.  


శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.  


శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం ఏడు గంటలకు శ్రీదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామి వారు నాలుగు మాడ వీధిలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలో పూర్తయిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్వప్న తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనే, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుండి 6:30 నిమిషాల వరకు శ్రీవారి ఆలయంలో ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.


వసంతోత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జేత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.