అది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పాలగుట్టపల్లె! పాకాల పక్కన ఉండే చిన్నగ్రామం. కాస్త చీకటి పడితే బస్సు ఉండదు.! ఆటోలు అంతకన్నా తిరగవు. తీవ్రమైన కరువు. 2010 నుంచి ఐదేళ్లు వాన చినుకు పడలేదు. ఎటుచూసినా ఎండిన బీళ్లు. వ్యవసాయం అడుగంటి పోయింది. తిప్పికొడితే 70 కుటుంబాలు ఉంటాయేమో. అందరూ వ్యవసాయ కూలీలే. కొద్దోగొప్పో పాడి, కోళ్లు. అలాంటి ఒక గ్రామం ఇవాళ కాటన్ బ్యాగులకు కేరాఫ్ గా నిలిచిందీ అంటే.. ఆ సక్సెస్‌కి కారణం అపర్ణ అనే సామాజిక కార్యకర్త! పాలగుట్టపల్లె బ్యాగులంటే ఇవాళ ఒక బ్రాండ్.
అసలు కథలోకి వెళితే.. చెన్నైకి చెందిన అపర్ణాకృష్ణన్ దాదాపు 30 ఏళ్లక్రితం పాలగుట్టపల్లెలో కొంత భూమి కొని, సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. వర్షాలు లేని 2010-15 మధ్య కాలం ఆమెని కలవరపెట్టింది. తన సంగతి పక్కన పెడితే, వ్యవసాయం మీదనే ఆధారపడి, కూలీనాలి చేసుకునే పల్లె ప్రజల పరిస్థితి ఏంటని ఆవేదన చెందారు. సామాజిక బాధ్యత కలిగిన అపర్ణ వాళ్లను ఏదో రకంగా ఆదుకోవాలని అనుకున్నారు. ఊరిలో కొంతమంది మహిళలకు కుట్టుమిషన్ ఉంది. జాకెట్లు, చిన్నచిన్న దుస్తులు కుట్టేవారు. వాళ్లని చేరదీస్తే మిగతా మహిళలకు కూడా ఉపాధి దొరుకుతుందని అపర్ణ భావించారు. అలా వారిని కాటన్ సంచుల తయారీకి సిద్ధం చేశారామె.
అపర్ణా కృష్ణన్ తన చేతుల మీదుగా కొంత డబ్బు అడ్వాన్స్‌గా ఇస్తే, వాటితో కాటన్ బట్ట కొనుక్కొచ్చి వంద బ్యాగుల వరకు కుట్టిచ్చారు. అలా మొదలైంది వీరి ప్రయాణం. జూట్ బ్యాగులు కళావిహీనంగానే కనిపిస్తాయి. అలా అయితే వేరే బ్యాగులకు ఈ పల్లె బ్యాగులకు తేడా ఏముంటుంది. అందుకని అపర్ణ వీరికో ఐడియా ఇచ్చింది. పాలగుట్టపల్లె బ్యాగులకు ప్రత్యేకత రావాలంటే సంచుల మీద అందమైన ప్రింట్లు, ఎంబ్రాయిడరీ వగైరా వుండాలి. అలా అయితే కస్టమర్లను ఇట్టే ఆకట్టుకోవచ్చు. అపర్ణ సూచనతో నలుగురైదుగురు ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకున్నారు. నెమలి, వినాయకుడి బొమ్మలతో పాటు, ఆర్డర్లు ఇచ్చే కంపెనీల లోగోలు, ప్రింట్లు వేసి, కుట్టి పంపుతుంటారు. ఆ ఐడియాతో బ్యాగులకు ఇంకా మంచి పేరు వచ్చింది. ఆ మధ్య యూపీలో జరిగిన ఆర్గానిక్ కాంగ్రెస్ సదస్సుకి ఆరువేలకు పైగా సంచులు కుట్టి పంపించారు. ఆ తర్వాత కంపార్టుమెంటులుగా ఉండే కూరగాయల సంచులు తయారుచేశారు. వాటికైతే బాగా డిమాండ్ వచ్చింది. ఇక ఆర్గానిక్ ప్రాడక్ట్స్ అమ్మే షాపుల నుంచి ఆర్డర్లు కుప్పలు తెప్పలుగా వస్తుంటాయి.
వాటికి మార్కెటింగ్ ఎలా? ప్రచారం ఎలా?
కాటన్ బ్యాగులు కుడతారు సరే! ఆర్డర్లు ఎలా? వాటికి మార్కెటింగ్ ఎలా? ప్రచారం ఎలా? పెట్టుబడి ఎక్కడినుంచి వస్తుంది! వీటన్నిటినీ అపర్ణే దగ్గరుండి చూసుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాను నమ్ముకున్నారు. అందులోనూ ప్రధానంగా వాట్సప్. ఆ తర్వాత వెబ్ సైట్. మెటీరియల్‌ను సేకరించడం మొదలుకుని ప్రోటోటైప్‌లను తయారు చేయడం, డెలివరీ గడువులను నిర్ధారించడం, క్వాలిటీ కంట్రోల్ ఇలా పూర్తిగా ఈ పల్లె మహిళలే నిర్వహిస్తారు. వీళ్లకి అక్షరం ముక్కరాదు. అయినా వ్యాపారమంతా వాట్సప్, వెబ్ సైట్ ద్వారానే చేస్తుంటారు. అంటే ఈ లెక్కన ఊరిలో మహిళలంతా డిజిటల్ అక్షరాస్యులే అన్నమాట. వచ్చిన డబ్బుతోనే ఇప్పటివరకు రొటేషన్ చేసుకుంటూ వచ్చారు. కాటన్ బట్ట, పెయింటింగ్ వగైరా మధురై నుంచి వస్తుంది.
ఇప్పటి వరకు 50వేల బ్యాగ్‌లను అమ్మారంటే అతిశయోక్తి కాదు. US, UK, కెనడా వంటి దేశాలలో కూడా వీళ్లకు కస్టమర్లు ఉన్నారు. ఊరగాయలను కూడా తయారు చేస్తుంటారు. కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతిన్నా మళ్లీ పుంజుకున్నారు. కష్ట సమయంలో ఈ ఊరి మహిళల స్వయం సమృద్ధి తోడుగా నిలిచిన అపర్ణా కృష్ణన్ కృషి ఎంతైనా అభినందనీయం.