తిరుమ(Tirumala)లో అనూహ్యరీతిలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి ఊహించని రీతిలో తిరుపతి(Tirupati)లో భక్తుల రష్ విపరీతంగా కనిపిస్తోంది. సర్వదర్శనలా టోకెన్లు ఇస్తున్న గోవిందరాజుల సత్రాలు(Govindarajula Satram), అలిపిరి(Alipiri) శ్రీదేవి భూదేవి(Sridevi Bhudevi) కాంప్లెక్స్, విష్ణు నివాసాల దగ్గర వేల కొద్దీ భక్తులు క్యూలెైన్లలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్నపిల్లలు, వృద్ధులతో స్వామి వారి దర్శనం కోసం వచ్చిన వారికి ఊపిరి ఆడని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సిచ్యుయేషన్‌ను డీల్‌ చేయడంలో టీటీడీ(TTD) చేతులెత్తేసిందని చెప్పాలి. అసలు సర్వదర్శన టోకెన్లు(Sarva Darshanam Tokens) జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే టీటీడీ ఇస్తున్న సర్వదర్శనం టోకెన్లు అన్నీ టైం స్లాటెడ్. అంటే ఈ రోజు టికెట్ ఇచ్చారంటే  రేపో, ఎల్లుండో ఫలానా టైంలో వెళ్లండని టోకెన్ రాసి ఉంటుంది. సో ఆ రెండు రోజులో మూడురోజులో భక్తులు తిరుపతిలోనే ఉండి ఆ టైంలో తిరుమల వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవాలి.


నేరుగా ఎవరైనా వెళ్లిపోవచ్చు


ఇప్పుడు అలాంటి టైం స్లాట్ టికెట్లను ఆఫ్ లైన్లో జారీ ఆపేసింది. వస్తున్న భక్తుల అంచనాతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అసలు టికెట్ లేకుండానే సర్వదర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. అంటే ఆధార్ కార్డ్ ఆర్ ఐడెంటెటీ ఏదైనా చూపించి తిరుమలకు వెళ్లొచ్చు. బట్ దర్శనానికి ఎంత టైం పడుతోంది తాము కూడా చెప్పలేమని టీటీడీనే స్పష్టంగా పత్రికా ప్రకటన ఇచ్చింది. 


రెండు లక్షల మందికి అనుమతించవచ్చు


సో వచ్చిన మేరకు భక్తులను తిరుమలకు తరలించి అక్కడ ఉన్న క్యూ కాంప్లెక్స్‌ల్లోకి అనుమతిస్తారు. తిరుమలలో ప్రధానంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, క్యూ కాంప్లెక్స్ 2లు ఉంటాయి. ఇవి కాకుండా నారాయణగిరి ఉద్యానవనంలో క్యూలైన్లు ఉన్నాయి. క్యూ కాంప్లైక్స్ 1లో 15 కంపార్ట్ మెంట్లు సర్వీస్‌లో ఉంటే 2లో దాదాపు 31 కంపార్ట్‌మెంట్‌లు ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక్క తిరుమలలోనే 2 లక్షల మందికి భక్తులను టీటీడీ అకామడేట్ చేయగలదు. 


సౌకర్యాలు కల్పించగలదా


ఇప్పుడు అన్నింటికంటే పెద్ద సవాల్ ఏంటంటే...దర్శనం ఎన్ని గంటల్లో అవుతుందో చెప్పలేకపోతోంది టీటీడీ. ముందు జాగ్రత్తగా ఆదివారం వరకూ వీఐపీల దర్శనాలను పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సో ఇప్పడు అనుమతిస్తున్న భక్తులకు ఒకరోజు కావచ్చు రెండు రోజులు కావచ్చు టైంకి ఫుడ్, మంచినీళ్లు ఇవ్వటం టీటీడీకి అతిపెద్ద సవాల్. అంతేకాదు వాళ్లకు వాష్ రూం ఫెసిలిటీ కల్పించాల్సిన బాధ్యత కూడా టీటీడీ మీద ఉంది. ఓ లెక్కా పత్రం ఉన్నప్పుడే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఎంత మంది భక్తులు తిరుమలకు వస్తున్నారో లెక్కే లేదు. 


కొంచెం ఈ దర్శనాల బ్యాక్ గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే
గత రెండేళ్లుగా కేవలం పరిమిత సంఖ్యలో టీటీడీ భక్తులను దర్శనాలకు అనుమతిస్తోంది. 2020లో కోవిడ్ ఆంక్షలు దేశంలో మొదలయ్యాక...భక్తుల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా టీటీడీ కొన్ని నెలలపాటు దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది. ఆ టైంలో స్వామివారికి ఏకాంతంగా సేవలను నిర్వహించారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కేసులు తగ్గు ముఖం పట్టాక పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనాలకు అనుమతించటం ప్రారంభించింది. అది కూడా ఉచిత దర్శనాలు లేవు. స్టార్టింగ్‌లో కేవలం ఆన్ లైన్ విధానంలో 300 రూపాయల టికెట్లు మాత్రమే జారీ చేసింది. ఇంక వీఐపీలు బ్రేక్ దర్శనాలు అవి షరా మామూలే.


ఈ ఏడాది మొదట్లోనే దాదాపు రెండేళ్ల తర్వాత భక్తుల సంఖ్య క్రమేపీ పెరగటం ప్రారంభం అయింది. రోజుకు 50వేలు, 60 వేలు పైబడి భక్తులు రావటం మొదలైంది. వాస్తవానికి టీటీడీకి రోజుకు రెండున్నర నుంచి మూడు లక్షల మంది భక్తులను అకామడేట్ చేయగల కెపాసిటీ ఉంది. కింద తిరుపతిలో శ్రీనివాసం, విష్ణునివాసం, మాధవం లాంటి టీటీడీ వసతి సముదాయాలతోపాటు కొండపైన ఉన్న సత్రాలు, కాటేజ్‌లు ఇలా భక్తులు ఉండేందుకు వీలుగా తిరుమల, తిరుపతిలో పెద్ద వ్యవస్థ ఉంది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రోజుకు మూడు లక్షల మంది భక్తులను హ్యాండిల్ చేసిన చరిత్ర టీటీడీ కి ఉంది.


కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు. కేవలం ఆన్ లైన్ విధానం వైపే ఆలోచనలు పెట్టుకున్న టీటీడీ ఆఫ్ లైన్ విధానంలో ఒక్కసారిగా వచ్చిన ఇంత మంది భక్తులను ఎంత ప్రశాంతంగా దర్శనం చేయించి పంపిస్తున్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అఫ్ కోర్స్‌లో దీంట్లో టీటీడీ ప్రణాళిక లోపం కూడా ఉంది. తిరుమల అంటే కేవలం వీఐపీలు, 300 రూపాయలు వచ్చే భక్తులు కాదు. తిరుమల అంటే కాలినడకన మూడు నాలుగు గంటలు కొండెక్కి వచ్చే భక్తులు....తమిళనాడు, కర్ణాటక నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చే సామాన్య భక్తులు. వాళ్లేసే రూపాయి, రెండు రూపాయలతోనే టీటీడీ ఇంత పెద్ద వ్యవస్థగా మారింది. ఇప్పుడు అలాంటి సామాన్య భక్తుల తాకిడిని తట్టుకుని టీటీడీ ఎలా వ్యవహరిస్తుందనేది బిగ్ క్వశ్చన్.