Tension at Tadipatri as YSRCP, TDP cadres clash |

  అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. సార్వత్రిక ఎన్నికల జరిగి మూడు నెలలు గడిచినా తాడిపత్రిలో అసాధారణ పరిస్థితులు కనిపిస్తాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీతో వాతావరణం వేడెక్కింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జెసి ప్రభాకర్ రెడ్డి అనే తీరుగా తాడిపత్రి రాజకీయాలు ఉంటాయని తెలిసిందే. మంగళవారం సాయంత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో, వైసీపీ నేత గన్ చూపించి కవ్వింపు చర్యలకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


కేతిరెడ్డి పెద్దారెడ్డి తనకు కావాల్సిన కొన్ని పత్రాల కోసం తన ఇంటికి చేరుకున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చినట్లు తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు,  వైసీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు కందిగోపుల మురళి ఇంటికి కొంతమంది టీడీపీ కార్యకర్తలు వెళ్లారు. టీడీపీ శ్రేణులను కవ్వించేలా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద గన్ చూపించి హల్ చల్ చేసి, తొడ కొట్టడంతో పరిస్థితి అదుపుతప్పినట్లు సమాచారం.


టీడీపీ, వైసీపీ వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి అంచుడు కంది గోపుల మురళి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసమైంది.  కంది గోపుల మురళి వాహనాలను సైతం కొందరు ధ్వంసం చేశారు. బొలెరో వాహనాలను ఇంటి ముందున్న స్కూటీలను ధ్వంసం చేశారు. ఒక్కసారిగా ఇరువర్గాల నేతలు కూడా రోడ్డు మీదకు రావడంతో అసలు తాడిపత్రిలో ఏం జరుగుతుందో అనే హైటెన్షన్ నెలకొంది. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ రాళ్లు రువ్వుకున్నారు.


టీడీపీ, వైసీపీ శ్రేణుల పరస్పర దాడులు 
పెద్దిరెడ్డి తాడిపత్రికి వచ్చాక ఆయన అనుచరుడు, వైసీపీ నేత కందిగోపుల మురళి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఎవడొస్తారో రండిరా, చూసుకుందాం అంటూ గన్‌తో రోడ్డు మీద హల్‌చల్ చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. అందుకు బదులుగా టీడీపీ శ్రేణులు తగ్గేదేలే అన్నట్లుగా వైసీపీ నేత ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నంలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు, కవ్వింపు చర్యలకు దిగిన వైసీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపైకి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ, నిప్పు పెట్టి వీరంగం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతరం పంపించారు. పెద్దారెడ్డి పట్టణం విడిచి వెళ్లడంతో టీడీపీ శ్రేణులు శాంతించారు. పోలీసులు పెద్ద ఎత్తున తాడిపత్రి పట్టణమంతా పికేట్ నిర్వహిస్తున్నారు. డీఎస్పీ జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు అదనపు పోలీస్ బలగాలని కూడా తాడిపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం.


తుపాకీ చూపించడం వల్లే వివాదం ముదిరింది: జేసీ ప్రభాకర్ రెడ్డి


తాడిపత్రిలో గొడవలపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. వైసీపీ నేత కందిగోపుల మురళి గన్ చూపించడంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారని  చెప్పారు. వైసీపీ నేత రెచ్చగొట్టడం వల్ల టీడీపీ శ్రేణులు గట్టిగా బదులిచ్చారని పేర్కొన్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చారని తెలిసి, వైసీపీ శ్రేణులు టీడీపీ వర్గీయులను రెచ్చగొట్టాయని ఆరోపించారు. పెద్దారెడ్డి రాక గురించి తెలిసినా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయలేదని తెలిపారు. తాడిపత్రిలో ప్రశాంతత కోరుకునే వ్యక్తిని తానని, అందుకు పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


Also Read: Andhra Pradesh: భ‌వ‌న నిర్మాణాల‌కు సింగిల్ విండో ద్వారా త్వరగా అనుమ‌తులు - మంత్రి నారాయ‌ణ నిర్ణయం