Revanth Reddy Comments in Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జూన్ 4 తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. ⁠శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేస్తున్న అభివృద్ధి పనుల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ⁠తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.






‘‘తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఇప్పుడు సమయం దొరికింది. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మంచిగా కొనసాగాలని, అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని స్వామివారిని కోరాను. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో సత్సంబంధాలు కొనసాగిస్తాం. తెలంగాణ ప్రభుత్వం తరపున తిరుమల కొండపై సత్రం నిర్మాణం సహా కల్యాణ మండపం నిర్మించాలని నిర్ణయించాం. అ అభివృద్ధి పనుల్లో తెలంగాణ కూడా భాగస్వామ్యం తీసుకుంటుంది. ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత ఈ పనులు మొదలుపెడతాం.


ఏపీలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్వరలోనే ఏపీ సీఎంను కలుస్తాను. టీటీడీ సేవలో తెలంగాణ భాగస్వామ్యం ఉండాలని కోరతాను. ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకునేందుకు పని చేస్తాం’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.