Revanth Reddy In Tirumala: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. బుధవారం (మే 22) ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆలయానికి వచ్చిన రేవంత్ రెడ్డి కుటుంబానికి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు దగ్గరుండి చూశారు. అంతకుముందు రేవంత్ రెడ్డి తన మనవడి పుట్టు వెంట్రుకలు తీయించారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా రేవంత్ రెడ్డి శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు.
అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన రేవంత్ రెడ్డి అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. తెలంగాణలో నీటి సమస్యలు తీరాయని.. సకాలంలో వర్షాలు కురవడం మంచి పరిణామం అని అన్నారు. ఏపీలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తామని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడ్ని ప్రార్థించినట్లు రేవంత్ చెప్పారు.