ఏపీలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఇటీవల మహానాడు రెండో రోజు టీడీపీ మినీ మేనిఫెస్టో ప్రకటించింది. అందులో 6 కీలక హామీలు ఉండగా, దసరా సమయానికి వచ్చే ఎన్నికలకు పూర్తి స్థాయి మేనిఫెస్టోను పార్టీ అధినేత చంద్రబాబు ప్రజల ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. రాయలసీమలో పాదయాత్ర పూర్తి కావస్తున్న సందర్భంగా నారా లోకేశ్ సీమ మొత్తానికి 3 కీలక హామీలను ప్రకటించనున్నారని తెలుస్తోంది. సీమకు చెందిన టీడీపీ నేతలతో చర్చించి చంద్రబాబు ఈ విషయాలను ఖరారు చేశారని సమాచారం.


రాయలసీమ కోసం టీడీపీ కీలక ప్రకటన! 
టీడీపీ మిషన్ రాయలసీమ పేరుతో నారా లోకేష్ త్వరలోనే సీమ ప్రజలకుగానూ మూడు హామీలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. మిషన్ రాయలసీమ ప్రణాళికలో భాగంగా అన్నదాత ఆదాయం రెండింతలు చేయడం, నీటి వినియోగం ప్రతీ ఒక్కరి హక్కు, రాయలసీమను యువతకు ఉపాధి కేంద్రంగా మార్చుతామని యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రకటించనున్నారని సమాచారం. కడప మునిసిపల్ కార్పొరేషన్ లో రాజ రాజేశ్వరి కళ్యాణ మండపం వేదికగా జరగనున్న కార్యక్రమంలో లోకేష్ ఈ 3 హామీలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ప్రకటన వచ్చే వరకు ఇందులో ఏమైనా మార్పులు చేసే దిశగా పార్టీ కీలక నేతలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.


టీడీపీలో చేరిన కమలాపురం నేతలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో కమలాపురం నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. చెన్నముక్కపల్లి విడిది కేంద్రంలో కమలాపురం నియోజకవర్గం తప్పెట్ల గ్రామానికి చెందిన సర్పంచ్ గడికోట శాంతి, భర్త సుధాకర్ రెడ్డి, గండిరెడ్డిపల్లికి చెందిన మాజీ సర్పంచులు.. గాలి ప్రసాద్ రెడ్డి, దర్శన్ రెడ్డి, మిట్టపల్లికి చెందిన మాజీ సర్పంచ్ ప్రసాద్ రెడ్డి, గోనుమాకపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ శేఖర్ రెడ్డి, అంబవరం మాజీ ఎంపీటీసీ ముంతా జానయ్య, సీనియర్ నేతలు రామసుబ్బారెడ్డి, నాగేంద్ర రెడ్డి, దళిత నేతలు కొప్పుల జగన్, అనిల్, చంటితో పాటు పలువురు దళిత యువకులు సోమవారం లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు యువ నేత లోకేష్. 


ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కమలాపురంలో గెలుపేలక్ష్యంగా టీడీపీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. రాక్షసపాలనను అంతమొందిస్తేనే కడప జిల్లా వాసులకు స్వేచ్ఛ కలుగుతుందన్నారు. సీఎం సొంత జిల్లాలోనే ప్రజల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉందని, కడప జిల్లాలోనూ జగన్ పనైపోయిందని లోకేష్ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ను నమ్ముకున్నవారే వైసీపీ నుండి బయటకు వస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ జగన్ కు కడప జిల్లాలో ఎదురుగాలి వీచిందని గుర్తుచేశారు. 


నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వారు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. మిట్టపల్లికి చెందిన 20 కుటుంబాలు, గంగిరెడ్డిపల్లికి చెందిన 30 కుటుంబాలు, గోనుమాకులపల్లికి చెందిన 30 కుటుంబాలు, అలిదిన, పాయసంపల్లి, పడదుర్తి, చడిపిరాళ్లకు చెందిన ఎస్సీలు, ఎస్ఆర్ నగర్, జెబి నగర్ కాలనీ, ఉప్పర్పల్లికి చెందిన 40 కుటుంబాలు, తోలగంగనపల్లికి చెందిన 8 కుటుంబాల వారితో పాటు పలువురు టీడీపీలో చేరారు.