Anantapuram : రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్త కుటుంబానికి 5 లక్షల రూపాయల సాయం అందింది. నారాయణపురం పంచాయతీలోని సుఖదేవ్ నగర్‌కు చెందిన నర్సింహులు రెండు నెలల క్రితం ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొని మృతి చెందాడు. నరసింహులు అంతకు రెండు నెలల క్రితమే టిడిపి సభ్యత్వ నమోదు రెన్యువల్ చేసుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బాధిత కుటుంబానికి ఇన్సూరెన్స్ వచ్చేలా చొరవ తీసుకున్నారు.
తాజాగా నరసింహులు భార్య సరోజకు 5 లక్షల రూపాయలు తమ బ్యాంకు ఖాతాలో జమైంది. శనివారం సాయంత్రం నరసింహులు ఇంటికి వెళ్లి ఆయన భార్యా పిల్లలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరామర్శించారు. రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది నరసింహులు మరణం తర్వాత కుటుంబ పోషణ ఎలా అన్న అంశాల గురించి దగ్గుపాటి తెలుసుకున్నారు.
ఏ అవసరం ఉన్నా పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భరోసా ఇచ్చారు. కేవలం 100 రూపాయలతో సభ్యత్వం తీసుకున్నందుకు తమకు 5 లక్షల రూపాయలు సాయం అందిందని ఇందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే దగ్గుపాటితోపాటు మంత్రి నారా లోకేష్‌కు సరోజ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాయాన్ని ఎప్పటికీ మరువలేనన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆమె బాగోద్వేగానికి గురయ్యారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవ దేశంలో ఏ నాయకుడు చేయలేదన్నారు. గతంలో 100 రూపాయలు కడితే రెండు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండేదని కానీ ఇప్పుడు అది ఐదు లక్షలకు పెంచారన్నారు. దురదృష్టవశాత్తు ఇలా ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల సహాయం అందుతుందని ఇలాంటి ఆలోచన చేసిన గొప్ప నాయకుడు నారా లోకేష్ అన్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కోటి సభ్యత్వాల నమోదు లేదని అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమైందని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. గతంలో అర్బన్ నియోజకవర్గంలో 23 వేలకు మించి సభ్యత్వ నమోదు జరగలేదని.. ఇప్పుడు 78 వేలకుపైగా సభ్యత్వాలు నమోదు చేశామన్నారు. టిడిపి కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీతోపాటు తాను కూడా అండగా ఉంటానని దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు.