ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు అన్నీ బాదుడే బాదుడు అని చంద్రబాబు అన్నారు. అధికారం కోసం జగన్ నాడు ముద్దులు పెట్టి, సీఎం అయ్యాక జనాన్ని పిడిగుద్దులు గుద్దుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. పుంగనూరులో మంగళవారం నిర్వహించిన ప్రజాగళంలో చంద్రబాబు ప్రసంగించారు. తాము పొత్తు పెట్టుకుని వాస్తవాలు చెబుతున్నాం అన్నారు. కానీ గతంలో సీఎం జగన్ చీకటి ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించారు. మేం రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధితో పాటు సంక్షేమం కోసం పొత్తు పెట్టుకున్నాం అన్నారు చంద్రబాబు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ చెప్పారు. పొత్తునకు చొరవ చూపింది పవన్. తాను రాజమండ్రి జైల్లో ఉంటే కలిసి పొత్తు గురించి ప్రకటించారు. మిథున్ రెడ్డి పిఠాపురం వెళతాడంట. ఇక్కడి జనసైనికులు గ్లాసుకు పదును పెట్టాలని చంద్రబాబు సూచించారు.


ఖజానా డబ్బులు జగన్, పెద్దిరెడ్డి వద్దే ఉన్నాయి
సీఎం జగన్ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడని, అన్ని ధరలు పెంచేశాడని విమర్శించారు. నిత్యావసర వస్తువులతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయన్నారు. ఆస్తి పన్నును ఇష్టానుసారంగా పెంచడంతో పాటు చెత్త మీద కూడా పన్ను వేశాడు అని జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. జగన్ 2019లో కోడికత్తి డ్రామా.. ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నాడంటూ ఎద్దేవాచేశారు. దెబ్బ తగులుతుంది కానీ రాయిమాత్రం కనబడదని, ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తావు? అని ప్రశ్నించారు. జగన్ ఇప్పుడు క్లాస్ వార్ అంటున్నాడు.. క్లాస్ వార్ కాదు జగన్... ఇది క్యాష్ వార్. ప్రభుత్వ ఖజానాలో ఉండాల్సిన డబ్బు సీఎం జగన్ దగ్గర, మంత్రి పెద్దిరెడ్డి దగ్గరే ఉందన్నారు. 


పుంగనూరు ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది 
ఇక్కడి ప్రజాగళం సభకు వచ్చిన జన ప్రభంజనం చూస్తే పుంగనూరు ప్రజలకు ఈ రోజే స్వాతంత్ర్యం వచ్చినట్లుందన్నారు. పుంగనూరులో, రాష్ట్రంలో గెలిచేది మనమే. మంత్రి పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసే వ్యక్తి చల్లా బాబు, తను ఓ బుల్లెట్ లాగా దూసుకెళతారు అన్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన తండ్రి రాజకీయ నాయకుడు. ఈ జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే... ఒకటి తాను అని, రెండో వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అని చంద్రబాబు అన్నారు.  


మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఎంపీ,  తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ప్రజల్ని తమకు బానిసలు అని అనుకుంటున్నారా. ప్రజలే పెద్దిరెడ్డి కొమ్ములు విరచాలన్నారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ రాజకీయ ఆధిపత్యానికి గండికొట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. రాజంపేట ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే అంటే అభివృద్ధి... వైసీపీ అంటే అవినీతి అని మోదీ అన్నారని గుర్తుచేశారు. 


తన శివశక్తి డెయిరీకి పోటీగా మరో డైయిరీలను పుంగనూరుకు రానివ్వడం లేదని ఆరోపించారు. ‘రైతులు పండించే మామిడికాయల్లోనూ కమీషన్లు కొట్టేసిన దుర్మార్గుడు. రైతుల పొట్టగొట్టి వాళ్లను ఆ ఊరి నుంచి తరిమేయాలనుకున్నాడు. మైనింగ్, ఇసుక వ్యాపారం, మద్యం వ్యాపారం నడిపేది వీళ్లే. ఏమీ మిగల్చకుండా మొత్తం ఊడ్చేశారు. నా నియోజకవర్గంలో కుప్పంలో గ్రానైట్ కొట్టేశారు. ఐదేళ్లలో రూ.30 వేల కోట్లు అవినీతి సొమ్ము సంపాదించాడు. పుంగనూరులో దాడులు, అక్రమ కేసులు పెట్టని రోజు లేదు, అరెస్ట్ జరగని రోజు లేదు. కిరణ్ కుమార్ రెడ్డి ఎస్సీల కోసం సబ్ ప్లాన్ తీసుకొచ్చి చట్టం చేసి అమలు చేశారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు నేను కాపాడతా. ఉర్దూ యూనివర్సిటీ తీసుకువచ్చాను. షాదీ ఖానాలు కట్టించాం, దుల్హన్ పథకం, రంజాన్ తోఫా తో పాటు ఇమామ్ లు, మౌజన్ లకు, మసీదులకు ఆర్థికసాయం చేశాం. కుప్పంతో సమానంగా పుంగనూరును అభివృద్ధి చేస్తానని’ చంద్రబాబు అన్నారు.