Stampede at Chokkani Festival in Srikalahasti: శ్రీకాళహస్తిలో చొక్కాని ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. దీపోత్సవంలో మంటలు ఎగిసి పడటంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి, పలువురికి గాయాలయ్యాయి. తమిళ కార్తీక మాసం కృత్తిక దీపోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో నిర్వహించిన చొక్కాని ఉత్సవంలో అపస్తృతి చోటు చేసుకుంది. చొక్కాని ఉత్సవానికి స్థానికంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.


ఏటా కార్తీక పౌర్ణమి నాడు శ్రీకాళహస్తి ఆలయంలో చొక్కాని ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా చొక్కాని దీపోత్సవం నిర్వహిస్తారు. ఆలయ పరిసరాల్లోనే దాదాపు 20 అడుగుల ఎత్తులో పెద్ద దీపాన్ని ఏర్పాటు చేశారు. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకుండా దీపోత్సవం నిర్వహించడంతో అనూహ్యంగా ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో అక్కడున్న భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. దీంతో వారిని ఆలయ సెక్యూరిటీ అదుపు చేయలేకపోయారు. భక్తుల మధ్య తోపులాట జరిగి అది తొక్కిసలాటకు దారితీసింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న మహిళా సెక్యూరిటీ గార్డ్ చెయ్యి విరిగిపోవడంతో పాటు మరికొంతమంది భక్తులకు గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో ముగ్గురు ఆలయ సిబ్బంది, ఐదుగురు భక్తులకు గాయాలైనట్లు ప్రాథమికంగా తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి, శివుడు తనను ఆపి మోక్షం ఇవ్వడానికి ముందు కన్నప్ప లింగం నుండి ప్రవహించే రక్తాన్ని కప్పడానికి తన రెండు కళ్లను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశంగా పేర్కొంటారు.


తిరుపతికి 36 కి.మీ దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం, పంచభూత స్థలాలలో ఒకటైన వాయు లింగానికి (గాలి లింగం) ప్రసిద్ధి చెందింది. ఇది గాలిని సూచిస్తుంది. ఈ ఆలయాన్ని రాహు-కేతు క్షేత్రంగా, దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు. లోపలి ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించారు. బయటి ఆలయం 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళ - I తరువాత చోళ రాజులు, విజయనగర రాజులు నిర్మించారు. వాయు రూపంలో శివుడు కాళహస్తీశ్వరుడుగా ఇక్కడ పూజలు అందుకుంటాడు.