TTD Sekhar Reddy :  తిరుమల శ్రీవారికి పెద్ద ఎత్తున విరాళాలు లభిస్తున్నాయి.  చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు శేఖర్ రెడ్డి నేతృత్వంలో తొమ్మిది మంది దాతలు కలిసి టీటీడీకి రూ.5.11 కోట్లు విరాళం అందించారు. దాతలు ఈ మొత్తానికి సంబంధించిన డీడీని సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు. చెన్నై టి.నగర్‌లోని వెంకటనారాయణ రోడ్‌లో ప్రస్తుతం ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ కోసం స్థలం కొనుగోలుకు ఈ మొత్తాన్ని అందించారు. ఈ ఆలయానికి ఆనుకుని ఉన్న రూ.35 కోట్ల విలువైన  స్థలాన్ని చెన్నై స్థానిక సలహామండలి గుర్తించింది. ఈ స్థలం కొనుగోలుకు గతంలో కొంతమంది దాతలు 8,15,15,002 రూపాయలను విరాళంగా అందించారు.                                
 
ప్రస్తుతం విరాళం అందించిన దాతలు ర్యాపిడ్‌కేర్ గ్రూపు రూ.1.50 కోట్లు, కోయంబత్తూరుకు చెందిన వెంకట సుబ్రహ్మణ్యం, నాగరాజన్, సిఆర్ కన్ స్ట్రాక్షన్స్ వారు ఒక్కొక్కరు కోటి రూపాయలు, శరణ్, శెంబగమూర్తి ఒక్కొక్కరు 20 లక్షలు, నరేష్ సుబ్రహ్మణ్యం, బలహా కెమికల్స్(పి) లిమిటెడ్ వారు ఒక్కొక్కరు రూ. 10లక్షలు, నీలాద్రి ప్యాకింగ్స్ రూ.1లక్ష రూపాయలు విరాళంగా అందించారు. శేఖర్ రెడ్డి తమిళనాట బడా కాంట్రాక్టర్ గా గుర్తింపు పొందారు. ఆయన టీటీడీపై అమితమైన ఆసక్తితో ఉంటారు.                         


తెలుగుదేశం పార్టీ హయాంలోనూ శేఖర్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు. ఆ సమయంలో నోట్ల రద్దు జరిగింది. ఆర్బీఐ కొత్తగా జారీ చేసిన రెండు వేల నోట్లు ఆయన ఇంట్లో పెద్ద సంఖ్యలో దొరికాయి. అప్పట్లో జనం ఒక్క నోటు కోసం బ్యాంకుల్లో బారులు తీరుతున్న సమయంలో ఆయన వద్ద కొన్ని కోట్ల రూపాయల నగదు దొరికింది. ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు చేసిన సోదాల్లో పెద్ద ఎత్తున  బంగారం కూడా దొరికింది. తీవ్రమైన విమర్శలు రావడంతో ఆయనను అప్పటి ప్రభుత్వం టీటీడీ బోర్డు నుంచి తప్పించింది. *ఆ తర్వాత కేసులన్నీ తేలిపోయాయి. ఆయనకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.              


సాధారణంగా తమిళనాడు నుంచి టీటీడీ బోర్డులో ఒకరికి చోటు కల్పిస్తూ ఉంటారు అక్కడి ప్రభుత్వం చేసే సిఫార్సులకు అనుగుణంగా నియమిస్తారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. శేఖర్ రెడ్డి పేరునే  ఎక్కువగా ప్రతిపాదిస్తారని చెబుతూంటారు. టీడీపీ హయాంలో శేఖర్ రెడ్డిపై వైసీపీ తీవ్ర విమర్శలు చేసినా .. మళ్లీ తమ పార్టీ అధికారంలోకి రాగానే.. ఆయనకు టీటీడీ బోర్డు మెంబర్ గా పదవి ఇచ్చింది. తర్వాత చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడి పదవి ఇచ్చింది.