హిమాలయ పర్వతాలను తలపించే విధంగా ఏడుకొండలను మంచు కప్పేసింది. మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేలా చల్లటి గాలులు ఓవైపు పచ్చటి చెట్లు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వేసవి తాపంతో అల్లడి పోయిన శ్రీవారి భక్తులకు ఉపశమనం కల్పిస్తూ గత రెండు రోజులుగా తేలిక పాటి వర్షం కురవడం కారణంగా తెల్లటి పొగ మంచు తిరుమల గిరులను మింగినట్లు తలపిస్తుంది. ప్రకృతి రామనీయతకు పుట్టినిల్లైన సప్తగిరులు తిరుమల యాత్రకు వచ్చే భక్తుల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కటాక్షంతో పాటుగా మరచి పోలేని అనుభూతిని నింపుతుంది. శేషాద్రి నిలయుడి సన్నిధిలో ప్రకృతి సోయగాలు యాత్రికులను ఎంతగానో కనువిందు చేస్తున్నాయి.
కలియుగ వైకుంఠ వాసి శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైయున్న తిరుమల పుణ్యక్షేత్రం మధురమైన ప్రకృతి అందాలకు నెలవు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం సమయాల్లో ఏడుకొండలను మంచు దుప్పటి కమ్మి వేసే అద్భుత దృశ్యం భక్తుల మధులను ఎంత గానో ఆకట్టుకుంటుంది. గత రెండు రోజులుగా వేసవి తాపం నుండి ఉపశమనం కల్పిస్తూ తిరుమలలో కురిసిన వర్షం కారణంగా తిరుమలలో ఉష్ణోగ్రత బాగా తగ్గింది. దీంతో తిరుమల ఘాట్ రోడ్డుతో పాటుగా, తిరుమల గిరులు మొత్తం మంచుతో కప్పుకున్నాయి. వైకుంఠంను తలపించేలా మంచు పొగ తిరుమలను వ్యాపించి ఉండడంను చూసి యాత్రికులు ఎంజాయ్ చేస్తున్నారు.
మంచుతో మేఘాలు స్వయంగా భువిపై దిగి వచ్చినట్లు కనిపించే సరికొత్త వాతావరణం శ్రీనివాసుడి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రధానంగా శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతంలో భక్తులకు నూతన అనుభూతులు కలిగిస్తోంది. అలిపిరి మార్గం నుంచి తిరుమల శ్రీవారి ఆలయం వరకు దట్టమైన పొగమంచు కమ్ముకున్నాయి. కష్టాలను తొలగించే పెరిమాళ్ దర్శనంతో పాటుగా తిరుమల ప్రకృతి సోయగాలను చూసి భక్తులు ఎంతగానో మురిసి పోతున్నారు. సాధారణంగానే శ్రీవారి భక్తుల మనస్సును ఆకర్షించే తిరుమల ఉద్యానవనాలను పొగ మంచు కప్పేయడంతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది.
శేషాచల కొండలు మంచు పొగ కమ్మేయడంతో భక్తులకు కనువిందుతో పాటుగా ఇబ్బందులను తెచ్చి పెడుతుంది. మంచు పొగ కారణంగా ఎదురుగా వచ్చే మనుషులే కాదు, వాహనాలు సైతం కనిపించని పరిస్ధితి నెలకొంది. దీంతో యాత్రికులకు అవస్ధలు మాత్రం తప్పడం లేదు. మరి ముఖ్యంగా ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు మంచుతో ఇబ్బంది పడుతున్నారు. ముందు వెళ్లే వాహనాలు కనపడక ప్రయాణం కష్టతరంగా మారింది. ఇక అలిపిరి నడకమార్గం గుండా తిరుమలకు వెళ్ళే భక్తులు మాత్రం మంచు పొగను ఆస్వాదిస్తున్నారు. తిరుమల అందాలను తమ మొబైల్ ఫోన్స్ లో చిత్రాలను భధ్ర పరిచుకోవడమే కాకుండా సెల్ఫీలు దిగి తీపి గుర్తులుగా దాచుకుంటున్నారు.