Satyavedu MLA Adimulam Meets Minister Peddireddy: ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండడంతో ఎక్కడ చూసిన రాజకీయాల గురించే చర్చ సాగుతోంది. ప్రధాన పార్టీ్ల్లో అసంత‌‌‌‌ృప్తులు, బుజ్జగింపులు, మార్పులు, చేర్పులు, చేరికలతో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ఈ తంతు అధికార వైసీపీలో ఎక్కువగానే ఉందని చెప్పాలి. మరో సారి అధికారం దక్కించుకునేందుకు ప్రజాదరణ లేదనే పేరుతో వైసీపీ అధిస్టానం ఇప్పటికే పలువురు సిట్టింగులకు స్థాన చలనం చేసింది. మరి కొందరికి సీటు లేదని తేల్చిచెప్పింది.


ఈ నేపథ్యంలోనే ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పూతలపట్టు ఎమ్మెల్యేకు వైసీపీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో సీటు విషయంపై మొండి చేయి చూపింది. దానితో పాటుగా తిరుపతి జిల్లాలో దళిత సామాజికవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ముగ్గురిని మారుస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రి కాళ్లకు నమస్కరించడం చర్చనీయాంశమైంది. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 


పైకి నియోజకవర్గ అభివృద్ధి గురించి మంత్రి పెద్దిరెడ్డిని సత్యవేడు కోనేటి ఆదిమూలం కలిసినట్లు బయటకు చెబుతున్నారు. కానీ అంతర్గతంగా రానున్న ఎన్నికల్లో ఆదిమూలం సీటు విషయమై స్పష్టత అడిగినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. నియోజకవర్గ పరిధిలో పనులన్నీ మీరు చెప్పినట్లుగానే చేశానని, మరో సారి అవకాశం ఇవ్వాలని కోరినట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ఆదిమూలం శనివారం మంత్రిని కలిశారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. 


మంత్రి పెద్దిరెడ్డితో ఎమ్మెల్యే ఆదిమూలం భేటిపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. వైసీపీలో దళితులకు ప్రాధాన్యత లేదని, గతంలో ఎంఎస్ బాబుకు అన్యాయం చేశారని, ఇప్పుడు  మరో దళిత ఎమ్మెల్యేను సాగనంపడానికి సర్వేల పేరుతో కుట్రలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. వైసీపీలో దళితులకు మరో సారి అవకాశం రావాలంటే మంత్రుల కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.


జగన్‌పై విమర్శలు చేసిన ఎంఎస్ బాబు
సీఎం జగన్‌పై ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆయనకు సీటు నిరాకరించింది. దీంతో ఆయన తన ఆవేదనను బయటపెట్టారు. జగన్ చెప్పిన పనులన్నీ చేసినప్పుడు అసంతృప్తి ఉంటే అది తన వల్ల ఎలా అవుతుందని ఆయన నిలదీశారు. తాను ఏం తప్పు చేశానో జగన్ పిలిచి చెప్పాలని ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు. తాను జగన్ ను కలిసినప్పుడు వ్యతిరేకత ఉందని తనతో అన్నారని ఎంఎస్ బాబు మీడియాకు తెలిపారు. తనపై వ్యతిరేకత వచ్చిందంటే ఎవరిది బాధ్యత అని ఆయన ప్రశ్నించారు. జగన్ చెప్పినట్లే తాను గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తిరిగానని అన్నారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.