ఆంధ్రప్రదేశ్‌లో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డుప్రమాదాలు 9మందిని బలితీసుకున్నాయి. అన్నమయ్య జిల్లాలో తిరుమల నుంచి తిరిగి వెళ్తున్న భక్తుల వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా... ఆరుగురు గాయపడ్డారు. ఇక, చిత్తూరు జిల్లా పూతలపట్టు దగ్గర ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు
.
కర్ణాటకలోని బెల్గాం జిల్లా అత్తిని మండలం బండిచేరి గ్రామానికి చెందిన 14 మంది తుఫాన్ వాహనంలో దైవ దర్శనానికి బయల్దేరారు. ముందుగా శ్రీశైలంలో మల్లన్న దర్శరం చేసుకున్నారు. అక్కడి నుంచి తిరుమల దర్శనానికి వెళ్లారు. కానీ తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం దొరకలేదు. దీంతో తుఫ్రాన్ వాహనంలోనే తిరుమల నుంచి వెనుదిరిగారు. వీరి వాహనం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కేవీ పల్లి మండలం మఠంపల్లి క్రాస్ దగ్గరకు చేరుకుంది. అక్కడే ఈ ఘోర ప్రమాదం జరిగింది. వీరి వాహనాన్ని... లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుఫాన్ వాహనంలోని ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ముందుగా పీలేరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చి ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
కేవీ పల్లి పోలీసులు.. మృతదేహాలను పీలేరు ఆస్పత్రికి తరలించారు. మృతులంతా కర్నాటక బలగాం జిల్లా బండిచేరి గ్రామానికి చెందినవారు. మృతిచెందిన వారు తుఫాన్ డ్రైవర్ హనుమంతు(30), యాత్రికుల్లో మరో హనుమంతు(40), అంబికా(14), శోభా(34), మనంద(32)గా గుర్తించారు. కేవీపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవీ పల్లి ఎస్‌ఐ లోకేష్ ప్రమాదస్థలి పరిశీలించారు. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నారు. ప్రమాదం ఎలా జరిగింది..? కారణాలు ఏంటి..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోనూ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పూతలపట్టు నియోజకవర్గం తెల్లగుండ్లపల్లి సమీపంలో తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్‌ను... ఆంబులెన్స్ ఢీకొట్టింది. బెంగళూరు నుండి ఒంగోలు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ రోడ్డు ప్రక్కన ఆగి ఉంది. అదే సమయంలో.. బెంగళూరు విక్టోరియా ఆసుపత్రి నుంచి ఒడిశా వెళ్తున్న అంబులెన్స్.. ఆయిల్ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆంబులెన్స్‌లోని నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురుకి తీవ్రగాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. మృతులు అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న మంజులత, త్రిలోచనా, ఉమేష్ చంద్ర, విజయ్‌గా గుర్తించారు. మృతి జతిన్, దేబభ్రత, అంబులెన్స్ డ్రైవర్ సంజయ్‌తోపాటు అయిల్ ట్యాంకర్ డ్రైవర్ శంకర్‌కు తీవ్రగాయాలు అయినట్టు చెప్పారు. గాయపడిన నలుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో జరిగిన ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదమరి ఎస్సై సుమన్, కాణిపాకం ఎస్సై శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని... ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. గాయపడిన వారిని చిత్తూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.