Ram Chandra Yadav BCY party Campaign Vehicle Fire at Sadum Police Station- పుంగనూరు: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి సొంత గ్రామం ఎర్రాతివారి పల్లెలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌పై దాడికి యత్నించారు. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే బీసీవై పార్టీ ప్రచార రథాన్ని తగలబెట్టేశారు. 


 అసలేం జరిగిందంటే..
బీసీఐ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఎర్రాతివారి పల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు, బీసీవై పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామంలో రామచంద్ర యాదవ్ ప్రచారం చేయడంపై పెద్దిరెడ్డి బంధువు అభ్యంతరం తెలిపారు. పెద్దిరెడ్డి అనుచరులు రామచంద్ర యాదవ్ ప్రచార రథాన్ని అడ్డుకుని, ఆపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.



వెనక్కి వెళ్లిపోయిన తరువాత మరోచోట ప్రచారం చేస్తుంటే అక్కడ సైతం గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రామచంద్ర యాదవ్ ను, ప్రచార రథాలను సదుం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడికి చేరుకుని వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. బీసీవై పార్టీ ప్రచార రథంను సదుం పోలీస్ స్టేషన్ ముందు నిప్పు పెట్టి తగలబెట్టేశారు. 


2 రోజుల కిందట సైతం ఈ తరహాలోనే .. 
పుంగనూరు మండలంలోని మాగాండ్లపల్లెలోనూ బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ కు రెండు రోజుల కిందట ఇలాంటి అనుభవం ఎదురైంది. ఆయన ప్రచారం చేస్తుండగా వైసీపీ కార్యకర్తకి కరపత్రం అందజేసే టైమ్ లో వాగ్వాదం జరిగింది. అది మాటమాటా పెరిగి గొడవగా మారింది. వైసీపీ శ్రేణుల, బీసీవై శ్రేణులు పరస్పర రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో రామచంద్రయాదవ్ కు చెందిన ఓ వాహనం అద్దాలు పగిలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను శాంతింప చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.