Tirumala News: కలియుగ వైకుంఠంనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆయన ఈ భూమి పై ఆవతరించిన మాసం పురటాసి మాసంగా భక్తులు భావిస్తారు. తమిళలు పురాటాసి (పెరటాసి), (తిరుమల శనివారాలు)గా పిలుస్తారు. తమిళలు ఈ మాసం లో స్వామి వారిని దర్శించుకోవడానికి ఇష్టపడుతారు. ఈ నెల మొత్తం చాల భక్తి శ్రద్ధలతో స్వామి వారిని ప్రార్థిస్తారు. మద్యం, మాంసం లేకుండా స్వామి వారిని స్మరిస్తూ దూర ప్రాంతాల నుంచి సైతం కాలినడకన తిరుమలకు వస్తారు భక్తులు. ఈ సాంప్రదాయం తమిళులు ప్రారంభించినా నేటికి స్వామి వారి భక్తులు ఎక్కడ ఉన్న ఈ పురటాసి మాసాన్ని ఆచరిస్తారు.


వందల కిలోమీటర్లు ప్రయాణం
తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుపతి నుంచి అలిపిరి లేదా శ్రీవారి మెట్టు మార్గంలో నుంచి తిరుమలకు చేరుకుంటామని అందరికి తెలుసు. నడవలేని భక్తులు వాహనాలు, బస్సుల్లో తిరుమలకు వస్తారు. మరీ వందల కిలోమీటర్లు భక్తులు తిరుమలకు పాదయాత్రగా వస్తారని తెలుసా.


పురటాసి మాసం లో తమిళనాడు, కర్ణాటక, ఏపీ నుంచి వచ్చే భక్తులు తమ గ్రామాలు నుంచి అందరూ గోవింద మాలధారణ చేస్తారు. పురటాసి మాసం మొత్తం గ్రామాలకు గ్రామాలు తరలి పాదయాత్రగా తిరుమలకు ప్రయాణం అవుతారు. పసుపు రంగు బట్టలు ధరించి గోవింద స్మరణ చేస్తూ తిరుపతికి చేరుకుంటారు. ఇక్కడ తిరుమల మెట్ల పూజ చేసి అనంతరం సప్తగిరులను అధిరోహిస్తారు. 


తిరుమలకు రాలేని భక్తులు తమ ఇంటి వద్ద స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పిండి దీపాలు వెలిగించి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి ప్రార్థిస్తారు. ఇది పురటాసి మాసంలో ప్రతి శనివారం నిర్వహించే కార్యక్రమంగా మారిపోయింది. ఈ మాసం కోసం ఏడాది పాటు భక్తులు వేచి చూస్తారు అంటే ఆశ్చర్యం వేయక మానదు.


సౌకర్యాలు కల్పించాలి
దేశంలోని శ్రీవారి భక్తులు తిరుమల శనివారాలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. తమకు ఉన్నదానిలో స్వామి వారిని పూజిస్తారు. తమిళనాడు, కర్నాటక నుంచి వందలాది కిలో మీటర్లు భక్తులు పాదయాత్ర చేసి తిరుమల శ్రీవారి దర్శించుకుంటారు. ఇలాంటి భక్తులకు పూర్వం శ్రీకృష్ణ దేవరాయలు మండపాలను కట్టించారని ప్రతీతి. పాదయాత్రగా వచ్చే భక్తులు విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఉండేది. అయితే ఇలాంటి మండపాలు నేటికి కొన్ని అందుబాటులో ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం నుంచి ఏపీలోకి ప్రవేశించే నగరి, చిత్తూరు, సత్యవేడు ఇలాంటి ప్రాంతాల్లో మండపాలు కొన్నింటిని నేటికి పరిరక్షించారు. అయితే మరికొన్ని శిథిలావస్థకు చేరుకుంది. వాటిని పునఃనిర్మాణం చేయాలని భక్తులు కోరుతున్నారు.


తిరుమల కు వచ్చే భక్తులకు టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. తిరుపతిలో కొన్ని సౌకర్యాలు ఉన్నా అవి పూర్తి స్థాయిలో లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరి పాదయాత్రగా వచ్చే భక్తుల కష్టాలు అయితే వర్ణనాతీతం. పాదయాత్ర కోసం వచ్చే భక్తులకు సరైన వసతి సౌకర్యాలు లేవు. పూర్వం ఉన్న మండపాలు లేవు. నీరు, నీడ లేక అవస్తలు పడుతున్నారు భక్తులు. రోడ్డులో ఉన్న ఆలయాలు, ఫుట్ పాత్ లు, బస్ షెల్టర్ వద్ద విశ్రాంతి తీసుకునే పరిస్థితి నెలకొంది. పాదయాత్రగా వచ్చే భక్తులకు కొందరు స్వచ్చందంగా సేవ చేస్తున్న టీటీడీ చొరవ తీసుకుని ఇలాంటి భక్తులకు సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.


పురటాసి మాసం 
పురటాసి మాసం ఈనెల 17 వ తేదీ ప్రారంభమైంది. ఈనెల 21న మొదటి శనివారం, ఈనెల 28న రెండో శనివారం, అక్టోబర్ 5న మూడో శనివారం, అక్టోబర్ 12న నాలుగో శనివారం నిర్వహిస్తారు. అక్టోబర్ 15వ తేదీతో పురటాసి మాసం ముగుస్తుంది. ఈ మాసంలోనే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్టోబర్ 4 నుంచి 12 వ తేదీ వరకు ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది.