Fire incident at Madanapalle Sub Collectors office in Annamayya District | అమరావతి: అన్నమయ్య జిల్లాలో సంచలనంగా మారిన మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కలెక్టరేట్‌లో ఫైల్స్ దగ్దం అయిన కేసులో సంబంధిత అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మాజీ ఆర్డీవో మురళితో పాటు ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌లను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా సోమవారం నాడు (జులై 29న) ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం చంద్రబాబు సీరియస్
మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఫైళ్లు దగ్దం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. సీఎం చంద్రబాబు సైతం అగ్ని ప్రమాదం అనంతరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో కీలక ఫైళ్లు దగ్ధమైనప్పటికీ, సంబంధిత అధికారులు సకాలంలో స్పందించకపోవడంపై ఆయన సీరియస్ అయ్యారు. కీలక ఫైల్స్ కాలిపోవడంతో అత్యవసర విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అక్కడికి వెళ్లి పరిశీలించారు. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి ముందే మదనపల్లెలో ఈ ఘటన జరగడంపై ఉద్దేశపూర్వకంగా జరిగిందా అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వీఆర్‌కు సీఐ వలిబసు
మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో సీఐ వలిబసును వీఆర్‌కు పంపారు. మరోవైపు మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధం దర్యాప్తు ముమ్మరం చేశారు. మదనపల్లె వన్ టౌన్ సీఐ వలిబసు విధులు సరిగా నిర్వహించలేదని ఆయనపై చర్యలు తీసుకున్నారు. దాంతో సీఐ వలిబసును వీఆర్‌కు పంపుతూ జులై 24 ఆదేశాలు జారీ కావడం తెలిసిందే.
నాలుగు పెట్టెల దస్త్రాలు స్వాధీనం
ప్లాన్ ప్రకారమే ఫైళ్లను కాల్చారని, ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని పోలీసులు భావించడంతో వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారు. ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏ శశికాంత్‌పై నిఘా పెట్టిన పోలీసులు శనివారం, ఆదివారం రెండు రోజులపాటు హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు. శశికాంత్ నివాసం నుంచి దాదాపు నాలుగు పెట్టెల నిండా ఫైళ్లను పోలీసులు ఏపీకి తరలించినట్టు సమాచారం. అందులో కీలక పత్రాలు ఉంటాయని భావిస్తున్నారు. సీఐ రమేశ్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు సోదాలు జరిగాయి. ఫైళ్ల దహనం ఘటనలో రెవెన్యూ సిబ్బంది పాత్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.
మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు
ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాషాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణ అధికారులు మదనపల్లెలోని ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. నవాజ్ భాషా బెంగుళూరులో ఉండడంతో, నోటీసులు ఇచ్చిన విషయాన్నికుటుంబసభ్యులు ఆయనకు ఫోన్ లో సమాచారం అందించారు. విచారణకు హాజరు కావాలని తెలిపారు. దగ్ధమైన ఫైళ్లలో చాలావరకు భూములకు సంబంధించినవేనని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. భూ అక్రమాలకు సంబంధించిన ఫైళ్లను కాల్చడం వెనుక కుట్ర కోణం ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.