టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్ నారా భువనేశ్వరి రేపు (ఆగస్టు 29) కుప్పం వెళ్లనున్నారు. అందుకోసం ఆమె తిరుపతి నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పంకి చేరుకునున్నారు. కుప్పంలోని స్థానిక తిరుపతి గంగమ్మ దేవాలయంలో నారా భువనేశ్వరి పూజలు చేయనున్నారు. ఉదయం దాదాపు 10:45 గంటల ప్రాంతంలో నారా భువనేశ్వరి గంగమ్మ అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేయించనున్నారు.
అంతేకాకుండా కుప్పం పాత మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్టీఆర్ సంజీవని ఉచిత వైద్యశాలను ఉదయం 11:30 గంటలకు నారా భువనేశ్వరి ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సంజీవనికి అనుబంధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య మొబైల్ వ్యాన్ ను కూడా భువనేశ్వరి ప్రారంభించనున్నారు. కుప్పం మండలం పెద్దబంగారు నత్తంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని కూడా భువనేశ్వరి సందర్శించనున్నారు. శాంతిపురం మండలం కడపల్లి సమీపంలో శివపురం దగ్గర నిర్మాణంలో ఉన్న ఇంటి పనిని కూడా నారా భువనేశ్వరి పరిశీలించనున్నారు. అక్కడ్నంచి బెంగళూరుకు రోడ్డు మార్గంలో వెళ్లి.. హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.
గత మే నెలలో నారా భువనేశ్వరి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 15న ఉదయం కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో పాదయాత్రలో తల్లి భువనేశ్వరి సహా నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.