ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంఘించి దేవాలయంగా భావించే పాఠశాలలో ఏకంగా ఓ కులానికి సంబందించిన సభను ఏర్పాటు చేయడం అందరి నుంచి విమర్శలకు కారణం అవుతోంది. ఓ విద్యాలయంలో కాపు కులానికి సంబంధించిన సభ నిర్వహించడం పుత్తూరు పట్టణంలో తీవ్ర చర్చనీయ అంశంగా మారింది.. కుల మతాల ప్రస్తావన పాఠశాలలో తీసుకురాకూడదని, నిబంధనలను పక్కనపెట్టి విద్యార్థుల మనసులో కులమనే విష సంస్కృతికి బీజం వేసే విధంగా కొందరు కాపు నేతల అత్యుత్సాహం ఇట్టే కనిపిస్తోంది. కాపు సంక్షేమ సేవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఓ ప్రభుత్వ అంగన్వాడి కేంద్రంలో నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.


కాపు సంక్షేమ సేవా సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పుత్తూరులోని రాజాజీ నగర్ లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశానుసారం అంగన్వాడి కేంద్రాల్లో, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో కుల మతాలకు సంబంధించిన ఇలాంటి కార్యక్రమం చేపట్టరాదని నిబంధనలు ఉన్నాయి. కొందరు కాపు నేతల అత్యుత్సాహంతో అంగన్వాడి కేంద్రంలోని కాపు సంక్షేమ సేవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరపడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు స్థానికులు. 


కార్యక్రమం ఏర్పాటు చేసి అంగన్వాడి కేంద్రంలో కుల ప్రస్తావనతో పాటు, చిన్నారుల మనసులో విష బీజాన్ని నాటే విధంగా ప్రసంగాలు చేశారు. అంగన్వాడి కేంద్రంలో పనిచేసే సిబ్బంది ఇలాంటి కులానికి సంబంధించిన కార్యక్రమాలకు ఎలా అనుమతి ఇస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమం చేపట్టడానికి ఎవరు అనుమతించారని స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.  చదువుల రూపంలో ఒక్కో మెట్టు ఎక్కి తమ భవితకు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థుల వద్ద ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్న లేవనెత్తుతున్నారు. పిల్లలకు వివిధ పండ్లను పంచి, కులం పై ధ్యాస పెరిగేలా చేయడానికి ఇలాంటి పనులు కొందరు పనిగట్టుకుని చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపైన జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.