Kanipakam Temple History: మొదటి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడు స్వయంభుగా వెలసిన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేకువజామున ఒంటి గంటకు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడంతో చవితి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఉదయం మూడు గంటల నుండి స్వామి వారి దర్శనంకు భక్తులను అనుమతించారు. వినాయక చవితి నుండి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అకవడం ఆనవాయితీగా వస్తోంది. ఈక్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా నేటి నుండి 21 రోజుల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగనుంది. ఇందు కోసం ఆలయ పాలక మండలి, అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు సౌకర్యార్ధం ప్రత్యేక క్యూలైన్స్, వి.ఐ.పిల కోసం ప్రత్యేక క్యూలైన్స్ ఏర్పాటు చేసి త్రాగునీరు సౌఖర్యం కల్పించారు అధికారులు.
వినాయక చవితి పురస్కరించుకుని వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఆలయం చేరుకునే అవకాశం ఉండడంతో దాదాపు మూడు వందల మంది పోలీసు సిబ్బందితో భధ్రత ఏర్పాట్లు చేశారు. ఇక నిరంతరాయంగా 104 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక వినాయక చవితి సందర్భంగా ఆలయంను వివిధ రకాల పుష్పాలు, పండ్లతో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు అలయ అధికారులు. భక్తులను ఆకట్టుకునే విధంగా ఆలయంలో వివిధ రకాల విబాయకుడి ప్రతిమలను ఏర్పాటు చేసారు అధికారులు.
స్వయంభుగా వెలసిన వినాయకుడి ఆలయ చరిత్ర..
సత్యప్రమాణాలకు నెలవైన కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారు స్వయం వ్యక్తమై ఓ బావిలో వెలసిన దివ్య క్షేత్రం కాణిపాకం. దేశంలోని వినాయకుడి ఆలయాల్లో కాణిపాకం ఆలయంకు ఎంతో ప్రసిద్ది. ఇక్కడ వెలసిన స్వామి వారు భక్తుల కోర్కెలను తీర్చే కొంగుబంగారమై బాసీలుతున్నారు. చిత్తూరు జిల్లాలోని బహుదా నది తీరంలో వెలసిన లంబోదరునికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పూర్వం విహారపురి అనే ఊరిలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు. ఒక్కోక్కరు ఒక్కో వైకల్యంతో జన్మించారు. అందులో పెద్దవాడికి కళ్ళు కనపడవు, రెండవ వాడికి మాటలు రావు. చివరి వాడు చెవిటివారిగా జన్మించారు. కొన్నాళ్లకు ఆ ఊరిలో తీవ్రమైన కరువు తాండవిస్తుంది. దీంతో అక్కడి ప్రజలు సంక్షోభంతో అల్లాడి పోయారు.
Photo: wikipedia
ఆహార కొరత తీవ్ర స్థాయిలో ఏర్పడుతుంది. ఈ సోదరులు పంటలు పండించుకునేందుకు తమకున్న స్థలంలో ఒక బావిని త్రవ్వాలని భావించి, ముగ్గరు అన్నదమ్ములు బావిని తవ్వడం ప్రారంభించారు. కొంత లోతు తవ్విన తరువాత అక్కడ ఒక పెద్దరాయి అడ్డు తగిలింది. అడ్డుగా ఉన్న బండరాయిని పెకళించడానికి ముగ్గురు అన్నదమ్ములు అనేక ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో రాయికి పార తగిలి వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మి ఆ సోదరుల మీద పడింది. ఆ మరుక్షణమే వారి వైకల్యం పోయింది. ఈ విషయాన్ని వాళ్లు తమ ఊరి ప్రజలందరికీ చెప్పగా, పరుగు పరుగున గ్రామ ప్రజలు బావి వద్దకు వచ్చి చూడగా వినాయకుడి రూపం దర్శన మిచ్చిందట. వెంటనే ఆ స్వామికి ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆ కాయల నుంచి వచ్చిన నీరు ఎకరం(కాణి) దూరం పారిందటా, అలా విహారపురికి కాణి పారకమ్ అని పేరు వచ్చింది. క్రమేణా అదే పేరు కాణిపాకంగా మారింది పురాణాల ద్వారా తెలుస్తోంది.
అంతకంతకు విఘ్నేశ్వరుడు ఎలా పెరుగుతున్నాడంటే.??
కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారు స్వయంగా వెలిశారని చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తుంది మూలవిరాట్. ప్రపంచంలోనే అత్యంత మహిమ కలిగిన ఆలయంగా వరసిద్ధి వినాయకుడి ఆలయం పేరొందింది. బావిలో ఉద్భవించిన వినాయకుడు పెరుగుతూ వస్తున్నాడు. చోళ రాజుల కాలంలో కాణిపాక ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కుళతుంగ చోళరాజు 11వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. 65 ఏళ్ల క్రితం బహుకరించిన వెండికవచం, 2000, 2002, 2006, 2007 సంవత్సరాల్లో భక్తులు ఇచ్చిన తొడుగులు స్వామికి ఇప్పుడు సరిపోక పోవడం విగ్రహం వృద్ధికి నిదర్శనంగా చెబుతారు. ఈ కవచాలను భక్తుల దర్శనార్థం ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించి ఉన్నారు. వరసిద్ధి వినాయకుడు సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. స్వామి ఎదుట తప్పుడు ప్రమాణాలు చేస్తే శిక్ష పడుతుందని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు ఇక్కడ ప్రమాణం చేస్తే వాటికి దూరమవుతారని నమ్మకం. దీంతో పాటు రాజకీయ ప్రమాణాలు సైతం చేస్తుండడం విశేషం.