AP Teachers Biometric Attendance: ఏపీలో బయోమెట్రిక్ హాజరు అంశం మరింత వివాదాస్పదంగా మారేలా ఉంది. రాష్ట్రంలో సెప్టెంబరు 1 నుంచి తప్పనిసరిగా యాప్‌ నుంచి తప్పనిసరిగా హాజరు వేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నేటి (ఆగస్టు 31) లోపు ఉపాధ్యాయులంతా యాప్‌లో బయోమెట్రిక్ కోసం వివరాలు నమోదు చేసుకోవాలని టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌ సిబ్బందిని విద్యాశాఖ ఆదేశించింది.
ఒకవేళ ఎవరితోనైనా స్మార్ట్ ఫోన్ లేకపోవడం, యాప్ ఇన్ స్టాల్ చేసే అవకాశం లేకపోతే వారు సంబంధిత విద్యాసంస్థ హెడ్మాస్టర్ ఫోన్‌లో, లేక ఇతర స్టాఫ్ మొబైల్ నుంచి ముఖ ఆధారిత హాజరు వేయాలని విద్యాశాఖ తన ఆదేశాలలో పేర్కొంది. ఉపాధ్యాయులు యాప్ డౌన్ లోడ్ చేసుకోవద్దని ఫ్యాప్టో ఇటీవల ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఆగస్టు 18న చర్చలు జరగగా, విషయం తేలలేదు. ఆగస్టు 31 వరకు హాజరు వేయాలని, అనంతరం మరోసారి సమావేశం అవుతానని మంత్రి బొత్స వారికి సూచించారు. నేటితో ఆ గడువు ముగియనుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 1 నుంచి యాప్ హాజరు తప్పనిసరి అని, ఇందులో ఏ మార్పు లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. మంత్రితో చర్చలు పూర్తి స్థాయిలో చర్చలు జరగక ముందే విద్యాశాఖ యాప్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలివ్వడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.


ఫ్యాప్టో ఛైర్మన్ ఏమంటున్నారు..
ముఖ ఆధారిత బయో మెట్రిక్ హాజరు వేయడానికి ప్రభుత్వం డివైజ్‌లు ఇస్తే తప్పకుండా అలాగే పాటిస్తామని ఫ్యాప్టో ఛైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ముఖ ఆధారిత హాజరులో ఇబ్బందులున్నాయని, వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్రం ప్రభుత్వానిదే అన్నారు. ప్రభుత్వం యాప్ హాజరుకు ప్రత్యేక డివైజ్‌లు ఇచ్చే వరకు నూతన హాజరును ఉపాధ్యాయ సిబ్బంది నిర్ణయానికే వదిలేయాలని అభిప్రాయపడ్డారు. 

ఏపీలో మొత్తం 1,85,090 మంది ఉపాధ్యాయులున్నారు. అయితే ఉదయం అందరూ ఒకేసారి అటెండెన్స్ వేసినట్లయితే సర్వర్ సమస్య వచ్చి డౌన్ అవుతుందని ఓ వాదన. గ్రామీణ ప్రాంతాల్లో సమస్య మరీ అధికంగా ఉంటుందని, యాప్ ఓపెన్‌ కావడం లేదని చెబుతున్నారు. సొంత మొబైల్ లో యాప్‌ డౌన్‌లోడ్ చేశాక, అన్నింటికి యాక్సెస్ ఇవ్వాల్సి వస్తోందని.. దాని ద్వారా తమ వ్యక్తిగత సమాచారం ప్రభుత్వానికి వెళుతుందనే భయాలు కొందరు సిబ్బందిలో ఉన్నాయి. ప్రభుత్వమే డివైజ్‌లు ఇస్తే అభ్యంతరం లేదని, ఆ డివైజ్ లలో బయోమెట్రిక్ హాజరు తప్పకుండా వేస్తామని టీచర్లు చెబుతున్నారు. 
Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి.. ఆలస్య హాజరు ఎక్కువైతే వేతనాల్లో కోత


బయోమెట్రిక్ హాజరుపై ప్రతీ నెల నివేదిక 
రాష్ట్ర సచివాలయంలో సుమారు 10 శాతం మంది ఉద్యోగులు ఉదయం 11 గంటల తర్వాతే విధులకు హాజరవుతున్నట్టు తెలిసిందని ప్రభుత్వం పేర్కొంది. సచివాలయంలోని అన్ని విభాగాల్లోనూ 80 శాతం హాజరు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించింది. ఈ విషయంపై ఇప్పటికే జారీ చేసిన నిబంధనలను ఇకపై తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఉద్యోగ విరమణ చేసిన, బదిలీ అయిన ఉద్యోగులకు సంబంధించిన వివరాలను బయోమెట్రిక్ పరికరాల నుంచి తొలగించాలని తెలిపింది. బయోమెట్రిక్ హాజరు నివేదికలను ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశించింది. ఇందుకు ఆయా శాఖ కార్యదర్శి ఉద్యోగుల హాజరును పరిశీలించాలని పేర్కొంది.