తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఖతర్నాక్ కానిస్టేబుల్ గా పేరు తెచ్చుకున్న అక్కడ హెడ్ కానిస్టేబుల్ వైరిచర్ల ఉదయభాస్కర్ ఇటీవల ఓ వివాహితను లోబర్చుకొని ఆమె భర్తను వేధించిన ఘటన తెలిసిందే. అయితే, బాధిత భర్తకు అండగా స్థానిక వైసీపీ నాయకులు నిలవడంతో కానిస్టేబుల్ ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని బెదిరించిన కానిస్టేబుల్ ఉదయభాస్కర్ పై ఈనెల 29వ తేదీన కేసు నమోదు చేశారు. అయితే, అయినా కానిస్టేబుల్ కి బుద్ధి రాలేదు. అంతేకాక, పోలీసు డిపార్ట్‌మెంట్ పరువు బజారుకి ఈడ్చాడు.


తాజాగా పట్టపగలు ఆ వివాహితతో ఒక ఇంట్లో రాసలీలలు చేస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. ఒంటిపై బట్టలు లేకుండా ఉన్న కానిస్టేబుల్ కు దుస్తులు వేయించి బయట తీసుకొచ్చారు. అతడు పారిపోకుండా పట్టుకున్నారు. వివాహితతో రాసలీలలు చేస్తున్న విషయం కడియం పోలీసులకు తెలిపారు. అక్కడికి చేరుకున్న కడియం పోలీసులు కానిస్టేబుల్ ఉదయభాస్కర్ ను విడిపించడంతో అక్కడి నుంచి ఒక్క సారిగా పరుగు లంకించుకున్నాడు.


తమ కళ్ళముందే పారిపోతున్న హెడ్ కానిస్టేబుల్ ఉదయ భాస్కర్ ను స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉన్న పోలీసులు తమ పరువు పోతుందనే భయంతో స్థానికులను అడ్డుకున్నారు. దీంతో కడియం పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుని ఆందోళన చేస్తున్నారు. కానిస్టేబుల్ పై విచారణ జరిపి తక్షణం అరెస్టు చేయాలని చేయకపోతే పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు కానిస్టేబుల్ వికృత పనులు చేస్తున్నాడని వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.