- ఉభయదారులకు కాణిపాకం ఆలయ అర్చకుల మొండి చెయ్యి
- భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణ
- విరాళంగా ఇచ్చిన అమ్మవార్ల విగ్రహాలు, గోల్డ్ కోటెడ్ ఆభరణాలకు రసీదులు ఇవ్వాలి
- చిత్తూరుకు చెందిన ఉభయదారులు విజయలక్ష్మి మహేష్ చక్రవర్తి డిమాండ్..
కాణిపాకం వరసిద్ది వినాయక స్చామి వారి ఆలయం వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. మొన్న ఆలయ అర్చకుల వివాదం జరిగితే, నిన్న కాణిపాకం ఆలయ సిబ్బంది శ్రీవారి దర్శన టోకెన్ల కుంభం, నేడు ఆలయానికి విరాళంగా ఇచ్చిన అమ్మవార్ల విగ్రహాలు, గోల్డ్ కోటెడ్ ఆభరణాలకు రసీదు ఇవ్వాలంటూ ఆలయ ఉభయదారులు డిమాండ్ చేసిన ఘటన ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఉభయదారులు స్వామి వారిని భక్తితో కొలిసే భక్తులకు మొండి చేయి చూపిస్తున్నారని చిత్తూరు నగరం కట్టమంచికి చెందిన ఉభయదారులు కె. విజయలక్ష్మి మహేష్ చక్రవర్తి ఆరోపించారు. చిత్తూరు నగరంలోని కట్టమంచిలో మంగళవారం మధ్యాహ్నం కాణిపాకం ఉభయదారులు విహయలక్ష్మీ తమ నివాసంలో మీడియా ముఖంగా కాణిపాకం ఆలయ అర్చకులపై సంచళన ఆరోపణలు చేశారు.
కాణిపాకం ఆలయ ఉభయదారులు విజయలక్ష్మి వెల్లడించిన వివరాల మేరకు. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న మరగదాంబిక సమేత శ్రీ మణికంటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏడాది దసరా ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఒక లక్ష రూపాయలు వెచ్చించి లక్ష్మీ, సరస్వతి అమ్మవార్లకు అభిషేకం, లక్ష్మీ పూజ, శాశ్వత గ్రామోత్సవానికి గాను అప్పటి కాణిపాకం ఆలయ ఈవో పూర్ణచంద్రరావు నుంచి 2013 అక్టోబర్ 16వ తేదీన అనుమతి పొంది ఉన్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో 2013 వ సంవత్సరంలో సంబంధిత ఆలయ ప్రాంగణంలో రాహుకేత మండప నిర్మాణంతో పాటు, రూ 25 వేలు వెచ్చించి సరస్వతి అమ్మవారు, రూ 35 వేలు వెచ్చించి లక్ష్మీదేవి అమ్మవార్ల విగ్రహాలను కొనుగోలుకు గాను నగదు రూపంలో అప్పటి మణికంఠేశ్వర స్వామి ఆలయ ఉప ప్రధాన అర్చకులుగా ఉన్న సోమశేఖర్ స్వామి వారికి అందజేశామన్నారు. అదే క్రమంలో సోమశేఖర్ స్వామి వారి వినతి మేరకు మరో రూ 50 వేలుతో లక్ష్మీదేవి, సరస్వతి అమ్మవార్లకు గోల్డ్ కోటెడ్ ఆభరణాలను నగదు రూపేనా కానుకగా అందజేసినట్లు వెల్లడించారు.
విగ్రహాలకు, ఆభరణాలకు సంబంధించి పది సంవత్సరాలుగా కావస్తున్నా ఇప్పటి వరకు తనకు ఎటువంటి రసీదులు సైతం ఇవ్వలేదని ఆరోపించారు. రసీదులు అడిగినప్పుడల్లా ఏదో కుంటి సాకులు చెప్పి కాలం వెలగదీస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల కాణిపాకం ఆలయంలో విభూది పట్టికి సంబంధించిన వేలూరు నారాయణి అమ్మ దేవస్థానం వారు కోరిన వెంటనే రసీదులు ఇచ్చారని, అయితే తనకు మాత్రం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ఇటీవల స్వామి వారి ఆలయ జీర్నోదరణ అనంతరం నిర్వహించిన ఆలయ కుంభాభిషేక కార్యక్రమానికి సైతం తనకు ఆహ్వానం లేదని, కనీసం తనకు తీర్థప్రసాదాలు సైతం చేర్చలేదంటూ ఆలయ ఉభయదారులు విజయలక్ష్మి ఆరోపించారు.
అమ్మవార్ల విగ్రహాలు, గోల్డ్ కోటెడ్ ఆభరణాలు మాయం,రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారితో పాటు మరో 17 మంది సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి కాణిపాకంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టడంతో పాటు ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కాణిపాకం ఆలయ ఉభయదారులు కె.విజయలక్ష్మీ కోరారు.