Paritala Sunitha Padayatra: శ్రీ సత్యసాయి జిల్లా పేరూరు మండలం గరిమాకుల పల్లి గ్రామంలో మాజీ మంత్రి పరిటాల సునీత ‘రైతు కోసం’ పాదయాత్ర ప్రారంభం అయింది. ఈ పాదయాత్రకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. గరిమాకుల పల్లి నుంచి పేరూరు వరకు 18 కిలో మీటర్ల మేర మాజీ మంత్రి పరిటాల సునీత రైతు పాదయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. రైతు సమస్యలు తెలుసుకోవడానికి ‘రైతు కోసం’ పాదయాత్ర చేపట్టామని పరిటాల సునీత అన్నారు. వర్షాలకు, వరదలకు జిల్లాలోని రైతులందరి పంటలు పూర్తిగా నష్టపోయారని వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని ఆమె అన్నారు.


ఎకరా పంటకు 30 వేలు నుంచి 50 వేల రూపాయలు పంట నష్ట పరిహారం ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని పరిటాల సునీత డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు. మరిమేకులపల్లిలో 2,700 రైతులు పంట సాగుచేస్తే 1,400 మందికి మాత్రమే ఇన్సూరెన్స్ ఇచ్చారని మిగిలిన రైతులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.


ముఖ్యమంత్రి బటన్ నొక్కితే సరిపోదని అందరు జగన్ రెడ్డిని బటన్ రెడ్డి అంటున్నారని అన్నారు. గ్రామాలలో చాలా మందికి పింఛన్ లు తొలగించారని, అలాగే చేనేత కార్మికులకు నేతన్న నేస్తం కూడా ఇవ్వడం లేదని తమకు ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిన సమస్యలు ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి లేఖ రాస్తానని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల వద్దకు వెళుతుంటే పర్మిషన్ లేదని అడ్డుకొనే ప్రయత్నం చేయడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని పాదయాత్రను అడ్డుకొవాలని చూస్తున్నారని అన్నారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోవాలని తాము భయపడేది లేదని తేల్చి చెప్పారు.


రాప్తాడు నియోజకవర్గం గరిమేకలపల్లి నుంచి పేరూరు వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఎంసీ పల్లి , చిన్న కొండాపురం, పెద్ద కొండాపురం, మక్కినవారిపల్లి గ్రామాలలోని రైతులను కలుస్తూ పాదయాత్ర చేస్తున్నారు. అనంతరం పేరూరులో పరిటాల సునీత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందచేయనున్నారు.


ఇటీవలే కేసీఆర్‌పై ప్రశంసలు


నవంబరు 7న పరిటాల సునీత యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం మహా అద్భుతమని కొనియాడారు. ఆలయాన్ని నిర్మించిన సీఎం కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారని పరిటాల సునీత ప్రశంసించారు. కార్తిక సోమవారం (నవంబరు 7) సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్తిక దీపారాధన చేశారు. మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ.. మోహన్ బాబు హీరోగా తన భర్త కథతో వచ్చిన ‘శ్రీరాములయ్య’ సినిమా విడుదల సమయంలో లక్ష్మీ నరసింహుడిని దర్శించుకున్నానని, తిరిగి ఇప్పుడు మరోసారి వచ్చినట్టు చెప్పారు. ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించిన సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారు.