Tirupati News: వారంత ఎన్నో ఆశలతో ఇంటర్‌లో చేరారు. ఫీజులు ఎక్కువైనా సరే తల్లిదండ్రులు కష్టపడి మరీ చెల్లించారు. పరీక్షలు సమీపిస్తున్నాయి బాగా చదవాలంటూ చిన్నారులు నిద్రాహారాలు మాని మరీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఇక పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి అనే సమయంలో కళాశాల యాజమాన్యం నుంచి పిలుపు రాకపోవడంతో వారే ప్రిన్సిపల్ ను కలిశారు. చూస్తే అసలు కళాశాల యాక్టివేట్‌లో లేదు. పేరుకే బోర్డు తప్ప పని చేసేది మాత్రం లేదని తేలింది. అది కూడా అనుమతి ఒక చోట... నిర్వాహణ మరోచోట ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంతు. 


తిరుపతి నగరంలోని భైరాగిపట్టెడలో ఓం ఎస్.వి.వి జూనియర్ కళాశాల ఉంది. ఇక్కడ 89 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందారు. పేరుకే తిరుపతిలో కళాశాల.. అనుమతులు అన్ని చిత్తూరు జిల్లా పెనుమూరులో ఉన్నాయి. విద్యార్థులు వేలకు వేలు ఫీజులు కట్టారు. అనుమతులు లేవని తెలిసి కూడా అధికారులకు మాయ చేసి బహుమతులు అందుకోవడంతో ఏమి చేయలేకపోయారు. ఏడాది మొత్తం ఉన్న కళాశాల, అధ్యాపకులు వారు చేసేది ఏమిటని తెలుసుకునే ప్రయత్నం కూడా లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఏమి చేయలేక 11 మంది విద్యార్థులు పరీక్షలకు దూరమయ్యారు.
జరిగింది ఇది..! 


ఓ ప్రైవేట్ కళాశాలలో ఇన్ఛార్జ్‌గా (డైరెక్టర్‌కు సన్నిహితుడు) ఉన్న ఓం ప్రకాష్ రెడ్డి కళాశాల నుంచి ఫీజులు వసూలు చేసి (డైరెక్టర్‌కు తెలియకుండా) బయటకు వెళ్లిపోయాడు. అంత అయిపోయాక చూసుకునేకి 20 లక్లలకుపైగా నష్టపోయినట్లు గుర్తించారు. దానిపై కొంత ఇబ్బందులు పడి కొంత సెటిల్మెంట్ చేసుకుని.. మరికొంత డబ్బు తిరిగి సెటిల్ చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో అక్కడ తెచ్చుకున్న డబ్బు, తన కుటుంబం నుంచి తెచ్చిన డబ్బును ఓంప్రకాష్ పెనుమూరులోని డిగ్రీ కళాశాలతో పాటు ఉన్న జూనియర్ కాలేజీ నుంచి కొనుగోలు చేసుకున్నారు. ఆ జూనియర్ కాలేజీ విద్యార్థులు లేక గత మూడేళ్లుగా ఇన్ యాక్టివ్‌గా ఉంది. అలాంటి కాలేజీని కొనుగోలు చేశారు తప్ప దానికి సరైన ప్రొసీజర్ పాలో కాలేదు. 
ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటర్ బోర్డుకు తెలియకుండా తరగతులు ఓం ఎస్.వి.వి జూనియర్ కళాశాల పేరుతో ప్రారంభించారు. ఏడాది పాటు తరగతులు జరగ్గా.. వీఆర్వోల ద్వారా 89 మంది విద్యార్థులు చేరారు. తరగతులు అరాకొర జరగడం, పరీక్షలు సమీపిస్తున్న కొద్ది విద్యార్థుల తల్లిదండ్రులు హాల్ టికెట్ల కోసం ప్రశ్నించగా వారు సరైన స్పందన లేకపోవడంతో తల్లిదండ్రులు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్ యాక్టివ్ గా ఉన్న కళాశాల కు అడ్మిషన్లు ఎలా చేసుకున్నారని ప్రశ్నించారు. అప్పటికే హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. తిరుపతి, చిత్తూరు జిల్లా కలెక్టర్లను మంత్రి యుద్దప్రాతిపదికన ప్రత్యేక అనుమతితో విద్యార్థుల వివరాలు సేకరించాలని సూచించారు.


89 మందిలో 78 మంది వివరాలు మాత్రమే
కళాశాలను కొనుగోలు చేశారు. ఇంటర్ బోర్డుకు తెలియకుండా నిర్వహించారు. మధ్యవర్తులుగా కొన్ని సంఘాలకు ఆర్థిక సహాయం చేశారు. ప్రశ్నించాల్సిన అధికారులపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంత చేసిన అధికారులు పట్టించుకోకపోవడంతో 89 మంది విద్యార్థుల జీవితాలు అంధకారంలో వెళ్లకుండా కళాశాలకు భారీ ఫైన్ వేసి కాపాడగలిగారు. 


ఇంత చేస్తే జిల్లా కలెక్టర్లు ప్రమేయతో విద్యార్థుల వివరాలు ఇవ్వడంలో సైతం అలసత్వం చూపించారు. మొత్తం 89 మంది విద్యార్థులకుగాను 11 మంది విద్యార్థుల వివరాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు. వారు ప్రశ్నించకుండా పరీక్షల సమయానికి ఇస్తాము. మేమే బస్సు పెట్టి పరీక్షలకు తీసుకెళ్తామంటూ తల్లిదండ్రులను మభ్యపెట్టారు. తీర పరీక్షల రోజు విద్యార్థులను తీసుకెళ్లి.. తిరిగి ఇళ్ల వద్ద వదిలేయడంతో వారంతా రోడ్డు పైకి వచ్చారు. దీనిపై అధికారులు మాత్రం తమకు ఏమి సంబంధం లేదు అనేలా కళాశాల యాజమాన్యం ను అడగాలని చెప్పారు. 


కళాశాల కొన్నావాళ్లు సక్రమంగా అనుమతులు పొందాలి.. అమ్మిన వ్యక్తి కొనుగోలు చేసిన తరువాత అవి మార్పు చేసుకోవాలని సూచించాలి.. విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ అనుమతులు ఉన్నాయా లేదా అనేది కూడా చూడకుండా విద్యార్థులను చేర్చారు.. పట్టించుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో సకాలంలో విషయం వెలుగులోకి రావడంతో 78 మంది విద్యార్థులు చిత్తూరు జిల్లాలో పరీక్షలకు హాజరుకాగా.. 11 మంది జీవితాలు అంధకారంలోకి వెళ్లాయి. ఏడాది నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారో.. ఈ ఘటన పై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.