Devotee Dies in Tirumala: తిరుమలలో విషాదం - క్యూలైన్లో కుప్పకూలిన భక్తుడు మృతి
తిరుమలలో విషాదం - క్యూలైన్లో కుప్పకూలిన భక్తుడు
గుండెపోటు రావడంతో కుప్పకూలిన వేదాచలం (64)
అంబులెన్స్ ద్వారా తిరుమల అశ్విని హాస్పిటల్ కు తరలింపు
మార్గం మధ్యలోనే ఆయన చనిపోయారని వైద్యులు వెల్లడి
తిరుమల శ్రీవారి సన్నిధిలో విషాదం జరిగింది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుడు గుండెపోటుతో మరణించాడు. చెన్నైకి చెందిన వేదాచలం (64) క్యూలైన్ లో స్పృహ తప్పి పడిపోయాడు. రద్దీ ఎక్కువ ఉండడంతో భక్తుడ్ని క్యూలైన్ నుండి వెలుపలకు వచ్చేందుకు సమయం పట్టింది. అక్కడి నుంచి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే చనిపోయినట్లు సమాచారం.అంబులెన్స్ ద్వారా తిరుమల అశ్విని హాస్పిటల్ కు తరలించగా.. పరీక్షించిన వైద్యులు మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలియజేశారు.
పొరుగు రాష్ట్రం నుంచి స్వామివారి దర్శనానికి..
తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన వేదాచలం అనే భక్తుడు స్వామివారిని దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చాడు. శ్రీవారి దర్శనానికి క్యూ లైన్లో ఉన్న ఆయన ఒక్కసారిగా సృహ తప్పి పడిపోయారు. భక్తుల రద్దీ అధికం కావడంతో ఊపిరాడక వేదాచలం కిందపోయాడని కుటుంబ సభ్యులు భావించారు. ప్రాథమిక అందించాలని భావించిన కుటుంబసభ్యులు రద్దీ ఉన్న క్యూ లైన్ నుంచి ఎలాగోలా వేదాచలంను బయటకు తీసుకొచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. కుటుంబసభ్యులు మెడికల్ టీమ్ సహాయంతో ఆయనను హుటాహుటినా సమీపంలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. ఆస్పత్రిలో అతన్ని పరిక్షించిన వైద్యులు మార్గం మధ్యలోనే వేదాచలం చనిపోయారని నిర్ధారించారు. వేదాచలం చనిపోయాడని డాక్టర్లు ప్రకటించగానే మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. క్యూలైన్లో రద్దీ అధికంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించటానికి కాస్త ఆలస్యం జరిగిందని కుటుంబీకులు వాపోయారు.
భక్తులతో ఏడుకొండలు కిటకిట..
Heavy Rush In Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు ముగుసినా ఏడుకొండలకు భక్తులు పోటెత్తుతున్నారు. కలియుగ దైవం శ్రీనివాసుడి దివ్యధామం తిరుమల పుణ్యక్షేత్రం గోవింద నామ స్మరణలతో మారుమోగుతుంది. నిన్న ఒక్క రోజులో 74,304 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. ఇక స్వామి వారికి 31,880 మంది తలనీలాలు సమర్పించగా, 5.45 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. అయితే సర్వదర్శనం భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండడంతో బయట క్యూలైన్స్ లో భక్తుకు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు 20 గంటల సమయం పడుతుంది.. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు మూడు గంటల సమయం పడుతుంది..