ఓ ఎలుక చేసిన పని ఏకంగా పోలీస్ స్టేషన్ ను గడగడలాడించింది. పెద్ద పేలుడు రావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంతకీ ఆ ఎలుక ఏం చేసిందో తెలుసా? చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శనివారం ఉదయాన్నే పెద్ద పేలుడు చోటు చేసుకుంది. దీంతో డ్యూటీలో ఉన్న డ్యూటీలో ఉన్న పోలీసులు అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఏం జరిగిందా అని ఆరే తీస్తే ఆ ప్రాంగణంలో కొంత కాలం క్రితం పాతి పెట్టిన మందుగుండు పొడి పేలింది. అందుకు కారణం ఏంటా అని ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
నాలుగు సంవత్సరాల క్రితం గంగాధర నెల్లూరు మండల పరిధిలో అక్రమంగా రవాణా అవుతున్న గన్ పౌడర్‌ను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని స్టేషన్ వెనుక ఉన్న ఓ చెట్టు కింద భద్రంగా పూడ్చి పెట్టారు. పందికొక్కులు, కుక్కలు దాన్ని తవ్వకుండా ముందస్తు జాగ్రత్తగా దానిపై కాంక్రీట్ కూడా వేశారు. ఎలుకలు చెట్టు కింద కన్నాలు చేసుకుంటూ, ఆ గన్ పౌడర్ పాతి పెట్టి ఉన్న స్థలంలోకి కూడా వెళ్లాయి. దీంతో ఆ ఒత్తిడికి శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో భారీ శబ్దంతో పేలుడు జరిగింది.
దీంతో స్టేషన్ వెనుకవైపు ఉన్న తలుపులు, కిటికీల అద్దాలు, దగ్గరే చుట్టుపక్కల ఉన్న ఇంటి కిటికీల అద్దాలు పగిలిపోయాయి. స్టేషన్ ఆవరణలో పార్క్ చేసి ఉన్న కారు, సీజ్ చేసి అక్కడే నిలిపిన బైక్ లు సహా ఇతర వాహనాలు కూడా దెబ్బ తిన్నాయి. ఆ గన్ పౌడర్ పేలుడుకు ఒక్కసారిగా ఉలిక్కిపడిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అనుకుంటూ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఏఎస్సై ఆంజనేయ రెడ్డి సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ మద్దయాచ్చారి, తహసీల్దారు ఇన్బనాథన్, ఎస్సై శ్రీనివాసరావు తదితర అధికారులు వచ్చి స్టేషన్ ను పరిశీలించారు. దీనిపై డీఎస్పీ మాట్లాడుతూ.. స్టేషన్ వెనుక వైపు పూడ్చి పెట్టిన 250 గ్రాముల గన్ పౌడర్ ప్రమాదవశాత్తూ పేలిపోయిందని తేల్చారు.
అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ గాయాలు కాలేదని తెలిపారు. మర్రిచెట్టు కింద నీడ ఉండటంతో అక్కడ మధ్యాహ్నం వేళల్లో పోలీసులు, స్టేషన్‌కు వచ్చిపోయేవారు, వేచి ఉండేవారు ఉంటుంటారు. అదే పేలుడు పగటిపూట జరిగి ఉంటే ప్రాణ నష్టం బాగా జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు.