అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన అరుంధతి సినిమాలో ఓ భయంకరమైన సీన్ గుర్తుందా? ఆమె తనువు చాలించడం కోసం ప్రాణాలు తీసుకొనే పద్ధతి ఒకటి ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. తలపై కొబ్బరికాయలు కొట్టించుకొనే ఆ సీన్ చూసేటప్పుడు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకొంటాయి. ఆమె పడిపోయే వరకూ కనీస చలనం లేకుండా తలపై కొబ్బరికాయలు కొడుతున్నా భరించి ప్రాణాలు వదిలిన తీరు కట్టిపడేస్తుంది. ఎందుకంటే తలపై ఏదైనా తగిలితేనే తట్టుకోలేం.. అలాంటిది రాయిలా ఉండే కొబ్బరికాయ కొట్టడం అంటే మాటలు కాదు. మాడు పగిలిపోయి, రక్తం ధార కడుతుంది. అది ఊహించుకోవడం కూడా కష్టమే! కానీ, సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి నిజ జీవితంలోనూ జరిగింది.


చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కొంత మంది తమ తలపై కొబ్బరి కాయలు కొట్టించుకున్నారు. గంగవరం మండలంలోని బీరగాని కురప్పల్లి గ్రామంలో కురవ కులస్తుల ఇష్ట దైవమైన నిడిగుంట బీర లింగేశ్వర స్వామి, శ్రీ ఉజ్జనీరాయస్వామి, వసరాయ స్వామి వారి దేవతా మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని నాలుగు రోజుల పాటు‌ ఈ నెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరిపారు. స్వామి వారికి మహా మంగళ పూజలతో పలు కార్యక్రమాలు చేపట్టారు. మూడోవ రోజు ఆదివారం ఆలయ అర్చకుడు తలపై టెంకాయ పవాడం అనే కార్యక్రమం నిర్వహించారు. మనకి గగుర్పాటు కలిగించే రీతిలో పూజారులు భక్తుల తలపై టెంకాయలు పగులకొడుతుంటే తెలుగు చలనచిత్రం అరుంధతి సినిమాలోని ఓ సీన్ గుర్తు కొస్తుంది. 


దైవ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం ఆనవాయితీగా వస్తొంది. స్వామి వారి మహోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.