ఆస్కార్ గెలిచిన ఆర్‌ఆర్‌ఆర్ టీంకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశం గర్వించదగ్గ విషయమంటూ అంతా పొగడ్తలతో ముంచెతుతున్నారు. సినీ అభిమానులంతా కాలర్ ఎగరేసి ఇది నాటునాటు అంటు డ్యాన్స్ చేసే మూమెంట్ అంటూ ట్వీట్‌లు చేస్తున్నారు. ఉదయం ఐదు గంటల నుంచి మొబైల్ ఫోన్లకు, టీవీలకు సోషల్ మీడియాకు అతక్కుపోయి ఆర్‌ఆర్‌ఆర్ ఆస్కార్ విజాయన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
RRR చిత్ర యూనిట్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందనలు తెలిపారు. బాహుబలి సినిమాతో తెలుగు సినీ ప్రస్థానాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి తెలుగుజాతి విప్లవ వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుకు అంతర్జాతీయ స్థాయి గౌరవాన్ని తీసుకురావడం గర్వించదగ్గ విషయమన్నారు. నాటునాటు పాటకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఎంఎం కీరవాణిని ప్రత్యేకంగా మంత్రి అభినందించారు. నాటు నాటుపాట ప్రపంచాన్ని ఆకర్షించడానికి కీలక భూమిక వహించిన రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ను మంత్రి ప్రశంసించారు.
ఆస్కార్ బరిలో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్స్ కేటగిరిలో గెలిచి నిలిచిన మరో చిత్రం ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్ర యూనిట్ని కూడా ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. తెలుగు సినీ పరిశ్రమకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి తెలిపారు..
ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్ దక్కడం భారతీయ సినిమాకే దక్కిన అత్యుత్తమ గౌరవంగా అభిప్రాయపడ్డారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. ఇది తెలుగువారికి మరింత ప్రత్యేకమంటూ ట్వీట్ చేశారు. ఈ అవార్డును గెలుచుకోవడం ద్వారా ‘నాటు నాటు’ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకుందన్నారు.
నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించిన స్వరకర్త కీరవాణికి, గీత రచయిత చంద్రబోస్‌కు, దర్శకుడు రాజమౌళి అండ్ RRR చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
ట్రిపుల్ ఆర్ (RRR) సినిమాలోని ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ అవార్డు లభించడం మర్చిపోలేని మధుర జ్ఝాపకమన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్. విశ్వవేదికపై తొలిసారి భారతీయ సినిమా పాటకు ఆస్కార్ అవార్డు రావడం, అందులోనూ తెలుగు పాట ఆ ఘనత సాధించడం భారతీయులందరికీ ప్రత్యేకించి ప్రపంచంలోని తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. ఇంత గొప్ప పాటను రాసిన చంద్రబోస్, సంగీతం అందించిన ఎం.ఎం.కీరవాణి, పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవతోపాటు RRR సినిమా చిత్ర యూనిట్ కు, ముఖ్యంగా తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి చేర్చిన రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
జక్కన్న బృందానికి శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గొప్ప గుర్తింపు తెచ్చి ఆస్కార్ అవార్డ్ పొందిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడం చరిత్రాత్మకమన్నారు రేవంత్. సినిమా బృందానికి దర్శకుడు రాజమౌళి, పాట రచయిత, గాయకులు, సంగీత దర్శకులు, నటులకు అందరినీ అభినందిస్తూ ప్రకటన విడుదల చేశారు.
ఇది దేశమే గర్వించదగ్గ సమయం అన్నారు బీజేపీ లీడర్ విష్ణువర్దన్ రెడ్డి. రాజమౌళి టీంకు ఆయన కంగ్రాట్స్ చెప్పారు.
ఆర్‌ఆర్‌ఆర్ టీం నారా లోకేష్ కంగ్రాట్స్ చెప్పారు.