తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు తమకు తోచినంత విరాళం అందిస్తుంటారు. హుండీకి సైతం గత రెండు నెలలుగా భారీగా ఆదాయం వస్తోంది. తాజాగా శ్రీవారికి కోటి రూపాయల భారీ విరాళం లభించింది. ముస్లిం దంపతులు రూ.1.02 కోట్ల రూపాయలను శ్రీవారి ఆలయానికి విరాళం అందించారు. ఈ మేరకు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి చెక్ ను అందజేశారు. ఆ ముస్లిం కుటంబానికి ఆలయ వేదపండితులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.


తమిళనాడు నుంచి శ్రీవారి దర్శనానికి.. 
చెన్నైకి చెందిన సుబీనా బాను, అబ్దుల్ ఘ‌నీ ముస్లిం దంప‌తులు తిరుమల శ్రీవారిని మంగళవారం దర్శించుకున్నారు. తమ పిల్లలతో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సుబీనాబాను, అబ్దుల్ ఘ‌నీ దంప‌తులు టీటీడీకి రూ. 1.02 కోట్లు విరాళంగా అందించారు. రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి దాత‌లు విరాళం చెక్కును అందించారు. ఇందులో రూ. 15 లక్షలను ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు వినియోగించాలని, మిగతా రూ.87 లక్షలను తిరుమ‌ల‌లో ఆధునీక‌రించిన శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో నూత‌న ఫ‌ర్నిచ‌ర్‌ కోసం, వంట‌శాల‌లో పాత్రల‌కు ఉపయోగించాలని టీటీడీ ఈవోను కోరారు.







రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ భారీ విరాళం
తిరుమల శ్రీవారిని ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గత వారం దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) రూ.1.5 కోట్లు విరాళంగా అందించారు అంబానీ. కాబోయే కోడలు రాధికతో కలసి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ముకేశ్ అంబానీకి వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన డీడీని తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఆ సమయంలో అంబానీతో పాటు ఎంపీలు గురుమూర్తి, విజయసాయిరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. పాల్గొన్నారు. 


గోశాలకు 
అనంతరం శ్రీవారి ఆలయం నుంచి అంబానీ గోశాలకు వెళ్లారు. అక్కడ ఉన్న మహాలక్ష్మి ఏనుగుకు పళ్ళు అందించారు. మహాలక్ష్మి వద్ద ముకేశ్ అంబానీ ఆశీర్వాదం తీసుకున్నారు. అటు నుంచి శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకున్నారు. అల్పాహారం స్వీకరించిన తర్వాత రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ప్రత్యేక చార్టెడ్ విమానంలో ముంబయికి తిరుగు ప్రయాణం కానున్నారు.