Cheddi Gang In AP: తిరుపతి: గతంలో ఏపీలో కొన్ని జిల్లాల్లో సంచలనం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ మరోసారి రాష్ట్రంలో కలకలం రేపుతోంది. తిరుపతి (Tirupati) జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు చెడ్డీ గ్యాంగ్ (Cheddi Gang) సంచారంపై నిర్దారణకు వచ్చారు. తిరుపతి నగర, శివారు ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ దొంగలు సంచరిస్తున్నట్లు సమాచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఇంటి కాలింగ్ బెల్ కొట్టినా, తలుపులు కొట్టినా తెరవకూడదని అది చాలా ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు.
తిరుపతి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో మీ ఇంటి తలుపులు తట్టడం కాలింగ్ బెల్ కొట్టినా, వేరే రకమైన శబ్దాలు చేస్తే ప్రమాదం ఉందని.. ఎవరనేది నిర్ధారించుకోకుండా తలుపులు తీయవద్దని ప్రజలను పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినా, మీకు అనుమానం కలిగే విధంగా ప్రవర్తించిన వెంటనే డయల్ 100 కి కాల్ చేయాలని లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని సూచించారు. చెడ్డీ గ్యాంగ్ సంచారం వార్తలపై జిల్లా పోలీసులు ఇప్పటికే అప్రమత్తం అయ్యారు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు దొంగలను పట్టుకోవడానికి తీవ్రమైన కృషి చేస్తున్నారని తెలిపారు.
తిరుపతి నగరం చుట్టుపక్కల ప్రాంతాలలో అత్యంత క్రూరమైన చెడ్డి గ్యాంగ్ దొంగలు సంచరిస్తున్నట్లు కొన్ని ఆనవాళ్లతో పాటు సమాచారం అందింది. దయచేసి నగరంలో పాటు నగర శివారులో నివాసం ఉంటున్న ప్రజలు రాత్రిపూట అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలను అలర్ట్ చేశారు. అలాగే రాత్రి వేళల్లో మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా మీ ఇంటి వద్దకు వచ్చి పలకరించినా లేదా తలుపులు తట్టడం, కాలింగ్ బెల్ కొట్టడం, ఇతరాత్రా శబ్దాలు చేసినా ప్రమాదం ఉందని కేకలు వేయాలని ప్రజలకు సూచించారు. కొందరు దుండగులు ఇలాంటి ఘటనలతో అమాయకులను తప్పుదోవ పట్టించి దొంగతనం చేస్తుంటారని, కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరించారు.
గత మూడేళ్లుగా ఇక్కడ చెడ్డీ గ్యాంగ్ కలకలం!
2021, 2022లోనూ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఏపీలో పలు జిల్లాల్లో చెడ్డీ గ్యాంగ్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. 2021లో ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. స్థానిక విద్యానగర్‌లో చోరీకి విఫలయత్నం చేశారు. ముందు విద్యుత్ నిలిపివేసి అనంతరం ఇళ్లల్లోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాల్లో ఈ తతంగం ఇది రికార్డైంది. తాళాలు వేసిన ఇళ్లలను లక్ష్యంగా చేసుకుని చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అలర్ట్ చేశారు. 2022లో తిరుచానూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చెడ్డి గ్యాంగ్ సంచరించింది. బృందావన కాలనీలో గోడ దూకి ఓ ఇంటిలోకి ప్రవేశించి చోరీ చేశారు. చేతిలో ఇనుప రాడ్డు పట్టుకుని తిరుగుతున్నట్లు సీసీ ఫుటేజీలో గుర్తించారు. చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సీసీ ఫుటేజీ విడుదల చేసి ప్రజల్ని అప్రమత్తం చేయడం తెలిసిందే.