TTD News: తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో దీపావళి(Diwali 2023) పర్వదినం సందర్భంగా ఆదివారం (Sunday ) దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్ర్తోక్తంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. అలాగే ప్రొటోకాల్‌ దర్శనం మినహా బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశారు. శనివారం బ్రేక్‌ దర్శనం సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని టీటీడీ పేర్కొంది.


వైకుంఠ ద్వార దర్శనానికి ఫుల్ డిమాండ్
శ్రీవారి వైకంఠ ద్వార దర్శన టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఆన్‌లైన్‌లో ఉంచిన 2.25 లక్షల టికెట్లను 21 నిమిషాల్లోనే భక్తులు బుక్‌ చేసుకున్నారు. డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనానికి సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనం, గదుల కోటా టికెట్లను శుక్రవారం ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేసింది. 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేయగా, కేవలం 21 నిమిషాల్లోనే పూర్తయ్యాయి. వీటి ద్వారా టీటీడీకి రూ.6.75 కోట్ల ఆదాయం సమకూరింది. శ్రీవాణి దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, గదుల కోటాను సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. 


పెద్ద శేషుడిపై అమ్మవారి దర్శనం
పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శనివారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై శ్రీ బద్రి  నారాయణుడి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు  ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.


అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారు హంస వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.


వాహన సేవల్లో ప్రముఖులు
వాహనసేవల్లో తిరుమల పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆలయ  డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, వీజివో  బాలి రెడ్డి, ఏఈవో రమేష్, ఆలయ అర్చకులు బాబు స్వామి, సూపరిండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్, గణేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మూడు ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు. 


తిరుమల హుండీ ఆదాయం
తిరుమల శ్రీవారిని శుక్రవారం 56,978 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,617 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.87 కోట్లు ఆదాయం వచ్చింది. నేరుగా శ్రీవారి దర్శనం చేసుకోచ్చు. దర్శన టోకెన్లు లేని వారికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతోంది.