ఈ ప్రభుత్వంలో ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలేదని.. ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టిన ఈ జగన్.. ఇప్పుడు పిడి గుద్దులు గుద్దుతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తాను రాయలసీమ కోసం 12 వేల కోట్లు ఖర్చు పెట్టానని అన్నారు. కానీ జగన్ ఖర్చు పెట్టింది కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే అని అన్నారు. జగన్ రివర్స్ మనిషి, దొంగ చూపులు, దొంగ పనులు, చేసే పనులన్నీ దొంగపనులే అని ఎద్దేవా చేశారు. రాయలసీమ ద్రోహి ఈ సైకో జగన్ అని.. తాను కియా మోటర్స్ తీసుకొచ్చి అనేక మందికి ఉపాధి కల్పించానని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ‘‘బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ’’ కార్యక్రమంలో భాగంగా కల్యాణ దుర్గంలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.


తాను బాంబులకే భయపడలేదని.. అలాంటింది వైసీపీ పేటీఎం బ్యాచ్‌కు భయపడతానా అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల సమయంలో ఒక ఛాన్స్ అంటూ ముద్దులు పెట్టిన జగన్, ఇప్పుడు పిడి గుద్దులు గుద్దుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో జిల్లాలో 114 చెరువులకు నీరు ఇవ్వాలని ప్రయత్నించానని తెలిపారు. కానీ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెచ్చిన భారీ పరికరాలు అన్ని తుప్పు పట్టి పోయి వృథాగా పడి ఉన్నాయని అన్నారు.


దసరాకు పూర్తి మేనిఫెస్టో ప్రకటిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. పుంగనూరులో ప్రశ్నిస్తే తనపై కూడా కేసులు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా చాలా కేసులు పెట్టారని గుర్తు చేశారు. తనను అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదన్నారు. రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేస్తున్నారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


అంతేకాక, మంత్రి ఉష శ్రీ చరణ్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉషా శ్రీ చరణ్ కబ్జాలపై మండిపడ్డారు. కళ్యాణదుర్గంలో అన్నీ కబ్జాలు, సెటిల్‌మెంట్లు ఆమెవని అన్నారు. 168 ఎకరాలు తక్కువ ధరకే మంత్రి లాక్కున్నారని ఆరోపించారు. లే అవుట్ వేస్తే డబ్బులియ్యాల్సిందేనని తేల్చి చెప్పారు. మంత్రి ఉషశ్రీ కొట్టేసిన 168 ఎకరాలకు తాను డబ్బు ఇస్తానని, తిరిగిస్తారా అని ప్రశ్నించారు. 


అంతకుముందు చంద్రబాబుపై మంత్రి ఉషశ్రీ చరణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కళ్యాణదుర్గం పర్యటన నేపథ్యంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబుకు మంత్రి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు కళ్యాణదుర్గానికి ఏం చేశారని నిలదీశారు. కళ్యాణదుర్గం పర్యటనలో సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తే సహించేది లేదని మంత్రి ఉషాశ్రీ చరణ్ హెచ్చరించారు. తాజాగా చంద్రబాబు విమర్శలు చేయడంతో ఉషశ్రీ చరణ్ స్పందనపై ఆసక్తి నెలకొంది.


సెల్ఫీ ఛాలెంజ్


ఉదయం "బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు, కౌకుంట్ల గ్రామ పరిధిలో హంద్రీ కాలువ, పవన విద్యుత్ ప్రాజెక్టు, డ్రిప్ ఇరిగేషన్ సమీపంలో సెల్ఫీలు దిగి, 'ప్రజలకు మేలు చేసే విధానం ఇది' అంటూ వైఎస్ఆర్ సీపీ పాలకులకు సెల్ఫీ ఛాలెంజ్ చేశారు.