చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఎటువంటి హడావిడి లేకుండా పర్యటన చాలా సాధారణంగా జరగాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన సమయంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తలెత్తిన వివాదంలో కుప్పం టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. టీడీపీ నేతలు, కార్యకర్తల్ని చిత్తూరు సబ్ జైల్ కి తరలించారు. ఈక్రమంలో గత నెల నారా లోకేష్ కుప్పం రిమాండ్ లో ఉన్న టీడీపీ నేతలను పరామర్శించి భరోసా ఇచ్చారు. సబ్ జైల్ లో ఉన్న కుప్పం నియోజకవర్గం టీడీపీ నాయకులను పరామర్శించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు మరికానేపట్లో వెళ్తున్నారు. చంద్రబాబు చిత్తూరు పర్యటనలో తెలుగు తమ్ముళ్ల హడావిడి లేకుండా పర్యటన సాధారణంగా సాగేలా ఆంక్షలు విధించారు పోలీసులు. చంద్రబాబు పాల్గొనే టూర్ లో ఓపెన్ టాప్ వాహనం, సౌండ్ వాహనానికి అనుమతి నిరాకరించారు.


టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. చంద్రబాబు మూడు రోజుల పర్యటనలో వైసిపి, టీడీపీ నాయకుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదాలు, రాళ్ల దాడులు జరిగి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ కారణాలతో పోలీసులు కుప్పం నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతలపై కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులతో పాటుగా మరో ఏడుగురిపై కోర్టు రిమాండ్ విధించడంతో వారిని చిత్తూరు సబ్ జైల్లో ఉంచారు. అయితే కుప్పంలో వైసిపి నాయకుల దౌర్జన్యంపై టీడీపీ హైకోర్టు ఆశ్రయించడంతో.. ప్రస్తుతం సబ్ జైల్లో ఉన్న టీడీపీ నాయకుల బెయిల్ పిటిషన్ కు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సబ్ జైల్ లో ఉన్న టీడీపీ నాయకులను పరామర్శించేందుకు చంద్రబాబు నాయుడు చిత్తూరు సబ్ జైలుకు చేరుకున్నారు. 


నేటి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొనున్నారు. వీరికి చిత్తూరు తిరుపతి జిల్లా నాయకులు స్వాగతం పలికిన అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గం గుండా చిత్తూరుకి చేరుకోనన్నారు. అనంతరం చిత్తూరు సబ్ జైల్లో ఉన్న టీడీపీ నాయకులను పరామర్శించిన తర్వాత చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలత నివాసానికి చేరుకొని ఆమెను పరామర్శించనున్నారు. అటు తరువాత జిల్లాలో తలెత్తున్న పరిస్థితులపై కటారి మేయర్ హేమలత నివాసంలో కొద్దిసేపు పాటు జిల్లా నేతలతో చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. అనంతరం చిత్తూరు నుండి సాయంత్రం 6 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరంకు బయలుదేరునున్నారు. 


చంద్రబాబు పర్యటనలో టీడీపీ నాయకులు కార్యకర్తల హడావిడి చేసేందుకు ఎటువంటి అనుమతులు లేవని చిత్తూరు పోలీసులు ఆంక్షలు విధించారు. అంతేకాకుండా రేణిగుంట విమానాశ్రయం నుండి చిత్తూరుకు బయలుదేరుతున్న చంద్రబాబు నాయుడు కాన్వాయ్ తో పాటుగా టీడీపీ నాయకులు కార్యకర్తల వాహనాలు ఉండరాదని, అంతేకాకుండా గుంపులు గుంపులుగా టీడీపీ నాయకులు కార్యకర్తలు చిత్తూరు సబ్ జైలు వద్ద ఉండేందుకు వీలు లేదంటూ చిత్తూరు పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో చిత్తూరు పోలీసులపై చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు మండిపడుతున్నారు.