కోట్లాది‌ మంది ఆరాధ్య దైవమైన శ్రీనివాసుడికి భక్తుల విషయంలో ఎలాంటి కొదవ లేదు. శ్రీవారి సేవలో మహారాజుల నుండి కటిక నిరుపేద వరకూ తరించిన వారే. క్షణకాలం పాటు జరిగే శ్రీనివాసుడి దర్శన భాగ్యం కోసం కోట్లాది మంది భక్తులు పరితపించి పోతుంటారు.. భక్తుల పాలిట కొంగు బంగారంమైన శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో గడపాలని, ఆయన సేవ చేయాలని భక్తులు ఎంతగానో తపించి పోతారు. కొందరు శ్రీనివాసుడికి కోట్ల రూపాయలు కానుకలుగా సమర్పిస్తే, మరి కొందరు ఆభరణాల రూపంలో, భూముల రూపంలో స్వామి వారికి కానుకలుగా సమర్పించడం చూస్తూనే ఉన్నాం.


ఇలా ఒక్కొక్కరు ఒక్కలా సేవలో చేస్తుంటే తిరుపతికి చెందిన ఒక వ్యక్తి మాత్రం స్వామి వారిపై అపారమైన భక్తి భావంతో దాదాపు 25 ఏళ్ళుగా పరదాలను కానుకగా సమర్పించి శ్రీ వేంకటేశ్వరుడి సేవకు అంకితం అయ్యారు. సెప్టెంబరు 27వ తేదీ నుండి ప్రారంభం అయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పరదాలను స్వయంగా తయారు చేసి అందిస్తున్న ఆ వ్యక్తి గురించి తెలుసుకుందాం


శ్రీనివాసుడి భక్తులందరికి సుపరిచితమైన పరమభక్తుడు, వృత్తినే ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తిగా, ఓ సాదా సీదా టైలరింగ్ జీవితం నుండి తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. శ్రీనివాసుడి పిలుపుతో సాక్షాత్తు వైకుంఠనాధుడుకే పరదాలను సమర్పించే మహద్భాగ్యాన్ని సంపాదించాడు. చిన్ననాటి‌ నుండి స్వామి వారిపై అపారమైన భక్తిని పెంచుకున్న మణి వారంలో మూడు రోజులు నడక‌మార్గం ద్వారా శ్రీనివాసుడి సన్నిధికి చేరుకుని దర్శన భాగ్యం పొంది, ఆలయ ప్రదక్షిణ చేస్తూ స్వామివారి సేవలో తరించే విధంగా అవకాశం ఇవ్వాలని ప్రార్థించేవాడు.. చదువులో రాణించలేక పోయినా ఏదో ఒక వృత్తి చేసుకొని జీవనం సాగించాలని భావించిన మణి, టైలరింగ్ లో వృత్తిలో అడుగు పెట్టి, మంచి నైపుణ్యం సంపాదించాడు.. ఈ‌నేపధ్యంలో 1999లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో హుండీ ఏర్పాటు చేసేందుకు మొదటి సారి అవకాశం‌ దక్కింది.. అక్కడి ఆలయానికి అనుగుణంగా హుండీని బట్టలతో తయారు చేసారు‌ మణి. అలా అక్కడి అధికారుల మన్నలను పొందాడు.


పరదాలు కుట్టేందుకు కూడా
తర్వాత శ్రీవారి‌ ఆలయంలో పరదాలు కుట్టేందుకు టీటీడీ అధికారుల నుండి మణికి పిలుపు వచ్చింది.. ఆనాటి‌ నుండి నేటి వరకూ ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంకు ముందు‌ రోజు నాడు తయారు చేసినా పరదాలను టీటీడీకి అందిస్తున్నాడు. ఆనాటి‌ నేటి వరకూ 23 ఏళ్లుగా స్వామి వారి ఆలయానికి పరదాలు, కురాలాలు సమర్పిస్తూ పరదాల మణిగా పేరు పొందాడు.. స్వామి వారి గర్భాలయంలో ఉన్న జయవిజయ ద్వారా పాలకుల ద్వారం వద్ద గరుడ వాహన భూషితుడైన శ్రీ వేంకటేశ్వరుడు, కామధేనువు, పరధాలపై భాగంలో శ్రీ పద్మావతి, లక్ష్మీదేవి అమ్మవార్లు, శ్రీవారి తిరునామంతో ఎంతో విశేషంగా ఆ పరదాలను రూపొందించారు. ఇక రాముల వారి మెడకు శ్రీ లక్ష్మి దేవి అమ్మవారి ప్రతిమ, ఐరావతం, శంఖు చక్రాలు అమర్చారు. ఇక కుల శేఖర పడి వద్ద పద్మావతి అమ్మవారు, తిరునామం వచ్చేలా రూపకల్పన పరదాలపై చేశారు.


శ్రీనివాసుడి సేవ దక్కడమే అదృష్టం..
తిరుపతిలో జన్మించి ఆ స్వామి వారికీ సేవ చేసే విధంగా ఆ స్వామే తనను ముందుకు నడిపిస్తున్నాడని, ఏడాదికి నాలుగు సార్లు శ్రీవారి ఆలయంలో జరిగే  కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ముందు పరదాలు సమర్పించడం జరుగుతుందని పరదాల‌మణి అంటున్నారు. ‘‘మూడు రకాల పరదాలు, రెండు కురాలాలు ప్రతి ఏటా నాలుగు సార్లు స్వామి వారికీ సమర్పించడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. స్వామి వారి గర్భాలయానికి అనుకోని ఉన్న కులశేఖర పడికి, రాముల వారి మెడకు, జయవిజయ ద్వారాలకు మూడు పరదాలు, స్వామి వారికి మరో రెండు కురాలాలు సమర్పిస్తాం. పరదాలు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంకు ముందు వచ్చే సోమవారం నాడు సిద్ధం చేసుకుంటాం. అనంతరం కాలిబాటగా తిరుమలకు చేరుకొని పవిత్ర పుష్కరిణిలో స్నానం ఆచరించి వరాహ స్వామి దర్శనం చేసుకుంటాం. మంగళవారం నాడు జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నాడు స్వామి వారికీ పరదాలు., కురాలాలు అందించడం ఆనవాయితీ. అంత స్వామి వారే నడిపించి నాకు ఈ భాగ్యాన్ని కల్పిస్తున్నారని నా ప్రగాఢ విశ్వాసం’’ అని ఎన్నో జన్మల పుణ్య ఫలంతోనే స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం‌ కలుగుతుందని, తన ప్రాణం ఉన్నంత వరకూ స్వామి వారి సేవలోనే గడుపుతానని పరధాల మణి ఏబీపీ దేశంతో అన్నారు.