Punganur Assembly Constituency News: ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నివాసంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆయన నివాసంతో పాటు చుట్టుపక్కల ఇళ్లపై, సన్నిహితులు, అనుచరుల ఇళ్లపై కూడా పోలీసులు అక్రమంగా దాడులు చేశారు. పోలీసులు దాడి చేసిన సమయంలో రామచంద్ర యాదవ్ నివాసంలో లేరు. పార్టీ క్యాడర్ కోసం తెప్పించిన కిట్ లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల చర్యలను బీసీ యువజన పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ చార్జి ప్రతి గ్రామంలోనూ వాల్ క్లాక్ లు పంపిణీ చేస్తే పట్టించుకోని పోలీసులు, అధికారులు.. తమ పార్టీ అధినేత కార్యకర్తల కోసం తెప్పించిన కిట్ లను స్వాధీనం చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వైసీపీకి ఒక న్యాయం, బీసీ యువజన పార్టీకి మరొక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందునే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 


పోలీసులకు ఆర్సీవై హెచ్చరిక..!
ఈ ఘటనపై బీసీ యువజన పార్టీ అధినేత బొడె రామచంద్ర యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. గత నాలుగున్నర సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లాలో కొంత మంది పోలీసు అధికారులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ లబ్దికోసమే పని చేస్తున్నారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి అనుచరులు, గుండాలు చేస్తున్న ఆరాచకాలను కట్టడి చేయడంలో గానీ, ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడంలో, గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంలో, భూకబ్జాలను అరికట్టడంలో ఏమాత్రం ప్రయత్నం చేయకపోగా, రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు రాజకీయ లబ్దికోసమే డిపార్ట్ మెంట్ లో వారు  పని చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేస్తే లిక్కర్ పంచుతున్నామంటూ తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. రైతుల సమస్యలపై పోరాడుతుంటే తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పోలీస్ వ్యవస్థలో ఉన్న కొంత మంది అధికారులు రామచంద్రరెడ్డి రాజకీయ లబ్దికోసం కోసం ఇలా ప్రత్యర్ధులపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ జరుగుతున్న అరాచకాల గురించి పోలీసు ఉన్నతాధికారులు గుర్తించాలని ఆయన కోరారు. 


‘మరీ నీచంగా పుంగనూరు పోలీసులు’


పొలీసులు ఈరోజు మరీ నీచానికి దిగజారారని రామచంద్ర యాదవ్ అన్నారు. మెంబర్ షిప్ డ్రైవ్ లో పాల్గొన్న బీసీ యువజన పార్టీ కార్యకర్తలకు కిట్ లు ఇవ్వడానికి పూర్తి రిసీప్ట్ లతో గోడ గడియారాలు తెప్పిస్తే వాటిని తప్పుడు ఆరోపణలతో సీజ్ చేయడం కోసం పోలీసులు వచ్చి వైసీపీ గుండాల్లాగా ప్రవర్తించారని ఆరోపించారు. వారు రామచంద్రారెడ్డికి రాజకీయ లబ్ది చేకూర్చవచ్చని అనుకుంటే పెద్ద మూర్ఘత్వం అవుతుందని అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడే పోలీసులు తగిన మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని హెచ్చరించారు. వీటిపై తాను న్యాయపోరాటం చేస్తానని, ఇలాంటి పిరికి పంద చర్యలకు వెనుకడుకు వేసే ప్రసక్తి లేదని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు.