Chittoor TDP News: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాల విభజన నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలుగా మారాయి. అయినప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లా గానే నేటికి అనేక శాఖల పరిపాలన వ్యవహారాలు సాగుతున్నాయి. 


ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎన్నడు లేని విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభావం పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 151 సీట్లు సాధించడం దేశంలో ఒక సంచలనం అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దానికి మించి సీట్లు సాధించడం 151 సీట్ల నుంచి ప్రతిపక్ష హోదా సైతం లేకుండా పోవడం మరో అతి పెద్ద మార్పు అని చెప్పొచ్చు. ఇలాంటి సుడిగాలిలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీల గురించి తెలుసుకుందాం.


జర్నలిస్టు నుంచి ఎమ్మెల్యే
కాణిపాకం ఆలయం కొలువైన పూతలపట్టు నియోజకవర్గంలో కూటమిలో భాగంగా టీడీపీ తరపున డాక్టర్ కలికిరి మురళి మోహన్ పోటీ చేసారు. గత 30 సంవత్సరాలుగా ఆ నియోజకవర్గంలో టీడీపీ గెలిచిన పరిస్థితి లేదు. ఇలాంటి చోట టీడీపీ జెండాను ఎగురవేస్తారు. ఆయన జర్నలిస్టు నుంచి ఎమ్మెల్యే అయ్యారు.


శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి ఆలయం పేరుతో ఉన్న శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తాత... తండ్రి బాటలో రాజకీయ వారసత్వం గా బరిలో నిలిచిన బొజ్జల సుధీర్ రెడ్డి ఈసారి టీడీపీ నుంచి గెలుపొందారు. నియోజకవర్గంలో తన తాత, తండ్రి తరహా పాలన చేస్తానని అంటున్నాడు.


నగిరిలో టీడీపీ హవా
నగిరి నియోజకవర్గం గత 10 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో నిలిచిన పేరు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గా, మంత్రిగా ఉంటూ మాట మంచిది కాక ఊరు వెనుక రాక ఓటమి పాలైంది ఆర్ కె రోజా. ఆమెపై పోటీ చేసి గెలుపొందిన గాలి భాను ప్రకాశ్ తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు.


చిత్తూరు కూడా టీడీపీ సొంతం
చిత్తూరు టీడీపీ తరపున పోటీ చేసిన గురజాల జగన్ మోహన్ చిత్తూరు చరిత్ర లో కనీవిని ఎరుగని తరహా విజయాన్ని అందించారు. గత పాలకులు నిర్లక్ష్యం... అభివృద్ధి కి ఆమడ దూరం... తీవ్రమైన నీటి సమస్య ఇలా వచ్చిన వారు ఎవరు సమస్యలు పరిష్కారించలేక పోవడంతో ప్రజలు ఈసారి చిత్తూరు వ్యక్తి అయిన ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్న గురజాలకు అవకాశం కల్పించారు.


పీలేరులో మళ్లీ నల్లారి కుటుంబం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పనిచేసిన కుటుంబానికి చెందిన వ్యక్తి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. ఆయన గత రెండు సార్లు టీడీపీ తరపున ఓటమి చెందిన పీలేరు నియోజకవర్గ ప్రజలు మూడో సారి ఎమ్మెల్యే కిరీటం అందించారు. నియోజకవర్గంలో 10 సంవత్సరాలు తరువాత నల్లారి కుటుంబ తిరిగి అధికారం పొందింది.


జీడీ నెల్లూరు టీడీపీ కైవసం
జీడీ నెల్లూరు నియోజకవర్గం తమిళ్ ప్రజల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గత 10 సంవత్సరాలు గా టీడీపీ పోటీ చేసి ఓటమి పాలైంది. ఈ నియోజకవర్గం ప్రజలు ఎన్నడు లేని విధంగా ఈసారి డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి.. ఆయన కుమార్తె కృపా లక్ష్మి నా పక్కన పెట్టి వైద్య వృత్తిలో అనేక విజయాలు అందుకున్న డాక్టర్ థామస్ ను ఎంచుకుని తొలిసారి అసెంబ్లీ కి పంపారు.


పులివర్తికే చంద్రగిరి ప్రజల ఓటు
ఇక చివరిగా చంద్రగిరి నియోజకవర్గం. ఇది ప్రస్తుత టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత గ్రామం ఉన్న నియోజకవర్గం. ఇక్కడ చాలా సంవత్సరాలుగా టీడీపీకి విజయం లేకుండా పోయింది. రాష్ట్ర విభజన నుంచి జరిగిన ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఆయన ఈసారి ఓంగోలు కు వెళ్లగా ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేసారు. చెవిరెడ్డి కంచుకోట అయిన చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా టీడీపీ తరపున పులివర్తి నాని కి పట్టంకట్టి చంద్రగిరి కోట పై పసుపు జెండా ఎగిరేలా చేసారు.


ఇక పార్లమెంటు పరిధిలో చిత్తూరు నుంచి మాజీ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమల్ల ప్రసాద్ రావు చిత్తూరు చరిత్ర లో ఎన్నడు లేని విధంగా తొలి సారి అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేక.. టీడీపీ అభ్యర్థి గత అనుభవం మీద ఆధారపడి చిత్తూరు పార్లమెంటు సీటు టీడీపీ కు ఇచ్చారు ప్రజలు. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు... ఒక లోక్ సభ స్థానానికి కొత్త వారిని ప్రజలు గెలిపించారు.